April 2023 Theatrical Releases: ఏప్రిల్ మాసంలో పాన్ ఇండియా చిత్రాల సందడి.. ఏజెంట్ నుంచి పీఎస్-2 వరకు-upcoming telugu movies in theatres in april 2023 from ravanasura to agent
Telugu News  /  Entertainment  /  Upcoming Telugu Movies In Theatres In April 2023 From Ravanasura To Agent
ఏప్రిల్ మాసంలో విడుదల కానున్న చిత్రాలు
ఏప్రిల్ మాసంలో విడుదల కానున్న చిత్రాలు

April 2023 Theatrical Releases: ఏప్రిల్ మాసంలో పాన్ ఇండియా చిత్రాల సందడి.. ఏజెంట్ నుంచి పీఎస్-2 వరకు

31 March 2023, 18:16 ISTMaragani Govardhan
31 March 2023, 18:16 IST

April 2023 Theatrical Releases: ఏప్రిల్ నెలలో థియేటర్లలో అదిరిపోయే సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. అక్కినేని అఖిల్ ఏజెంట్, మణిరత్నం పీఎస్-2, బిచ్చగాడు-2 లాంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

April 2023 Theatrical Releases: టాలీవుడ్‌లో ఫస్ట్ క్వార్టర్‌లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, రైటర్ పద్మభూషణ్, బలగం లాంటి సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరించాయి. ఇక చివర్లో నాని దసరా లాంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ సక్సెస్‌ను అందించాడు. దీంతో 2023లో మొదటి మూడు నెలలు ఓ మోస్తరు హిట్లు పడ్డాయి. ఇక వేసవి సీజన్ ప్రారంభణైంది. ఇందులో భాగంగా ఏప్రిల్ మాసంలో కొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఐపీఎల్ సీజన్ వస్తున్నప్పటికీ ఇది థియేటర్లలో సినిమా చూడకుండా నిరోధించకుండా ఉండాలంటే చిత్రనిర్మాతలు ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రత్యేక వ్యూహాలను అవలంభించాలి . మరి ఏప్రిల్ మాసంలో థియేటర్లలో విడుదలకానున్న కొన్ని ప్రధాన తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

రవితేజ 'రావణాసుర'..

మాస్ మహారాజా రవితేజ నటించిన సరికొత్త చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. సుశాంత్ కీలక పాత్రలో మెరిశాడు. అను ఇమ్యానుయెల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా చేశారు. వీరు కాకుండా శ్రీరామ్, దక్షా నగరికర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి వరుస హిట్ల తర్వాత రవితేజ నటించిన రావణాసుర చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

మీటర్..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం మీటర్. గత నెలలో వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలో సక్సెస్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు మీటర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది. కెరీర్‌లో తొలిసారిగా కిరణ్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు. అతుల్య రవి హీరోయిన్‌గా చేసింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి కార్తిక్ అందించిన పాటలు ఇప్పటికే శ్రోతలను బాగా అలరిస్తున్నాయి.

శాకుంతలం..

యశోద లాంటి సక్సెస్ తర్వాత సమంత నటించిన సరికొత్త చిత్రం శాకుంతలం. మహాకవి కాళీదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడ్కర్, కబీర్ బేడీ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బిచ్చగాడు-2..

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు-2 కూడా ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. 2016లో వచ్చిన బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ దర్శకుడు. తొలిసారి మెగాఫోన్ పట్టి అతడు రూపొందించిన ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా చేసింది. ఈ అనువాద చిత్రంలో రాధా రవి, వైజీ మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడీ, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు నిర్మాత.

విరూపాక్ష..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన చిత్రం విరూపాక్ష. ఈ మిస్టరీ థ్రిల్లర్ ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తిక్ దండు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్‌గా చేసింది. సాయి చంద్, బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.

ఏజెంట్..

అక్కినేని అఖిల్ నటించిన స్పై థ్రిల్లర్ ఏజెంట్ ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. వక్కంతం వంశీ కథను అందించారు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది.

పీఎస్-2..

దిగ్గజ దర్శకుడు మణిరత్న తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం పీఎస్-2 కూడా ఏప్రిల్ 28న విడుదల కానుంది. ప్రముఖ తమిళ రచయిత కల్కీ రాసిన పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, త్రిష, ప్రభు, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేశారు.