Upcoming Horror movies: ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న ఆరు హారర్ సినిమాలు ఇవే.. ఈ తెలుగు మూవీ మిస్ కావద్దు
Upcoming Horror movies: హారర్ జానర్ అంటే ఇష్టపడే వారికి ఈ ఏడాది పండగే. వెన్నులో వణుకు పుట్టించే ఆరు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో చూడండి.
Upcoming Horror movies: సినిమాల్లో హారర్ జానర్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. భయపడుతూనే ఆ సినిమాలు చూడటాన్ని థ్రిల్ గా ఫీలవుతుంటారు. అలాంటి మూవీ లవర్స్ కు ఇది గుడ్ న్యూస్. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అదిరిపోయే ఆరు హారర్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో ఒక తెలుగు మూవీ కూడా ఉంది.
రాబోయే హారర్ సినిమాలు ఇవే
థియేటర్లలో సీట్ల ఎడ్జ్ పై కూర్చొని వణికిపోతూ చూసేలా చేస్తాయి కొన్ని హారర్ సినిమాలు. ఈ ఏడాది వివిధ భాషల్లో అలాంటి కొన్ని మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మొదట థియేటర్లలో, తర్వాత ఓటీటీలోకి రాబోతున్న ఆ సినిమాలేంటో చూడండి.
గీతాంజలి మళ్లీ వచ్చింది
అంజలి నటించిన గీతాంజలి మూవీ గుర్తుందా? నవ్వులు పూయిస్తూనే భయపెట్టిన మూవీ ఇది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. గీతాంజలి మళ్లీ వచ్చింది పేరుతో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. దెయ్యం ఉన్న సంగీత్ మహల్ అనే లొకేషన్లో చిక్కుకుపోయిన ఓ సినిమా యూనిట్ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే రిలీజైంది.
అంజలితోపాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, అలీలాంటి వాళ్లు ఈ మూవీలో నటించారు. శివ తుర్లపాటి మూవీని డైరెక్ట్ చేశాడు. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీ.. అంజలికి కెరీర్లో 50వ సినిమా కానుంది. మరి ఈ సీక్వెల్ తో ఆమె ఎలా భయపెడుతుందో చూడాలి.
ది ఫస్ట్ ఒమెన్ - ఇంగ్లిష్
ది ఒమెన్ అనే క్లాసిక్ హారర్ మూవీకి ప్రీక్వెల్ గా వస్తున్న సినిమా ది ఫస్ట్ ఒమెన్. ఈ సినిమా ఈ శుక్రవారమే (ఏప్రిల్ 5) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి పార్ట్ లాగే ఈ ప్రీక్వెల్ కూడా భయపెడుతుందని అభిమానులు భావిస్తున్నారు.
మైనస్ వన్ - కన్నడ
ఈ ఏడాది రిలీజ్ కానున్న హారర్ సినిమాల్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మైనస్ వన్ కూడా ఒకటి. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ రుద్రపుర అనే ఊరి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ఈ ఏడాదే మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అరన్మరాయ్ 4- తమిళం
ఇక కోలీవుడ్ నుంచి హారర్ కామెడీ జానర్ లో వస్తున్న సినిమా అరన్మరాయ్. సాధారణంగా ఈ హారర్ కామెడీ జానర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. తమ పూర్వీకుల ప్యాలెస్ అమ్మాలనుకున్న ఓ కుటుంబానికి ఎదురయ్యే భయానక అనుభవం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అరన్మరాయ్ 4 మూవీ ఏప్రిల్ లేదా మే నెలల్లో రిలీజయ్యే అవకాశం ఉంది.
పిసాసు 2 - తమిళం
మిస్కిన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న మూవీ పిసాసు 2. పదేళ్ల కిందట వచ్చి భయపెట్టిన పిసాసు మూవీకి ఇది సీక్వెల్. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎల్ - మలయాళం
ఈ మధ్య మలయాళం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువవుతున్నారు. అలాంటి వాళ్ల కోసం ఎల్ అనే మలయాళం హారర్ మూవీ రాబోతోంది. కేరళలో గర్భవతులుగా ఉన్న మహిళల హత్యల వెనుక కారణమేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న ఐజీ రేణుక చుట్టూ తిరిగే కథ ఇది. ఈ ఎల్ మూవీ శుక్రవారమే (ఏప్రిల్ 5) థియేటర్లలో రిలీజ్ కానుంది.
టాపిక్