Unstoppable with NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్ గతంలో వచ్చిన సీజన్ల కంటే పూర్తి భిన్నంగా సాగనున్నట్లు తెలుస్తోంది. గతంలోని మూడు సీజన్లలో కేవలం తెలుగు హీరోహీరోయిన్లు, పొలిటీషియన్లతో సాగిన ఈ షోలో.. ఈ కొత్త సీజన్లో మాత్రం వేరే భాషల స్టార్లు కూడా రాబోతున్నారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్లో బాలకృష్ణతో తమిళ స్టార్ హీరో సూర్య సందడి చేయనున్నాడు.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఈ శుక్రవారం (అక్టోబర్ 25) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. తొలి ఎపిసోడ్ లో బావమరిది బాలకృష్ణతో బావ చంద్రబాబు సరదా ముచ్చట్లతో ప్రేక్షకులను అలరించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే రిలీజైంది. ఈ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి 8.30 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.
ఇక రెండో ఎపిసోడ్ కు తమిళ సూపర్ స్టార్ సూర్య రాబోతున్నాడు. గురువారం (అక్టోబర్ 24) సూర్య తన ఎపిసోడ్ ను షూట్ చేయనున్నాడు. దీనికోసం స్పెషల్ ప్లాన్స్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. బాలయ్య సినిమాలంటే తనకు ఇష్టమని సూర్య గతంలో చెప్పిన నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య టాక్ షో ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
సూర్య తన నెక్ట్స్ మూవీ కంగువ ప్రమోషన్లలో భాగంగా ఈ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకి వస్తున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ శివ కూడా ఈ షోలో కనిపించనున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామా అయిన కంగువ భారీ బడ్జెట్ తో రూపొందింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై సూర్య భారీ ఆశలే పెట్టుకున్నాడు.
ఇక కంగువ మూవీలో బాబీ డియోల్ విలన్ గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో అతడు కూడా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మరో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ తన యానిమల్ మూవీ ప్రమోషన్ల కోసం ఈ షోకి వచ్చాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ద్వారా తమ సినిమాను ప్రమోట్ చేయబోతోంది.
బాలకృష్ణ, సూర్య ఎపిసోడ్ దీపావళి అయిన నవంబర్ 1న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈసారి దుల్కర్ సల్మాన్ కూడా ఈ షోకి గెస్టుగా వస్తున్నాడు. ఇప్పటికే అతని ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. దుల్కర్ మరో తెలుగు మూవీ లక్కీ భాస్కర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోని అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక బాలయ్య కూతురు తేజస్విని ఈ షోకి క్రియేటివ్ హెడ్ గా ఉంది.