Ulajh trailer: దేవర బ్యూటీ స్పై థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది.. అదిరిపోయిన ట్రైలర్.. సినిమాలోనూ జాన్వీకి నెపోటిజం సవాలు
Ulajh trailer: దేవర మూవీ బ్యూటీ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ఉలఝ్ ట్రైలర్ రిలీజైంది. ఈ మూవీలోనూ ఆమె నెపోటిజం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.
Ulajh trailer: దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉలఝ్. ఇదొక స్పై థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం (జులై 16) రిలీజైంది. ఇందులో ఆమె ఇండియా తరఫున లండన్ లో హై కమిషనర్ గా కనిపించనుండటం విశేషం.
ఉలఝ్ ట్రైలర్
స్పై థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇవి మంచి థ్రిల్ పంచుతాయి. మరి ఈ జానర్ సినిమాకు జాన్వీ కపూర్ రూపంలో అందం కూడా తోడైతే ఎలా ఉంటుంది? ఇప్పుడు రాబోతున్న ఉలఝ్ మూవీలాగే ఉంటుంది. ఈ స్పై థ్రిల్లర్ సినిమా ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా మంగళవారం (జులై 16) ట్రైలర్ రిలీజైంది.
ఈ సినిమాలో జాన్వీ ఇండియా తరఫున యంగెస్ట్ డిప్యూటీ హై కమిషనర్ సుహానా భాటియా పాత్రలో నటిస్తోంది. హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన సుహానా.. చిన్న వయసులోనే అంత పెద్ద పదవి చేపట్టడంపై ఆమె కొలీగ్స్ నెపోటిజం ఆరోపణలు చేస్తారు. ఆమెకున్న భాటియా అనే ఇంటిపేరు వల్లే ఈ పదవి దక్కిందని, ఆమెకేదీ చేతకాదని వాళ్లు విమర్శించడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు.
ఈ క్రమంలో ఓ అండర్ కవర్ ఏజెంట్ నుంచి కూడా ఆమెకు సవాలు ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సుహానా 24 గంటల పాటు కనిపించకుండాపోతుంది. తనను బలి పశువును చేస్తున్నారని, అయితే తాను కూడా ఫైట్ చేయకుండా వదలబోనని జాన్వీ చెప్పే డైలాగుతో ఈ ట్రైలర్ ముగుస్తుంది. ఈ ట్రైలర్ ద్వారా మూవీ స్టోరీ ఏంటన్నది పెద్దగా రివీల్ కాలేదు.
హిట్ మూవీస్ మేకర్స్ నుంచి..
ఈ ఉలఝ్ మూవీని రాజీ, బధాయి దో, తల్వార్ లాంటి హిట్ సినిమాల మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుధాంశు సారియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్యతోపాటు రోషన్ మాథ్యూ, రాజేష్ తైలాంగ్, ఆదిల్ హుస్సేన్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజ్ కానుంది.
మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్.. ఇప్పుడీ ఉలఝ్ తో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన దేవర మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులో అడుగుపెట్టనుంది. ఇదే కాకుండా వరుణ్ ధావన్ తో కలిసి సన్నీ సంస్కారీ కి తులసి కుమారి మూవీ కూడా చేస్తోంది.
ఇక ఈ ఉలఝ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగానే జాన్వీ తన పెళ్లిపై కూడా స్పందించింది. తానో సీక్రెట్ చెప్పాలని అనుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్టు గురించి ప్రస్తావిస్తూ అది పెళ్లి గురించేనా అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. మీకు పిచ్చి పట్టింది అంటూ ఆమె అనడం విశేషం.
టాపిక్