Nuvvu Nenu: థియేటర్లలోకి మళ్లీ వస్తున్న ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ సినిమా.. రీ-రిలీజ్ డేట్ ఇదే
Nuvvu Nenu Re Release: నువ్వు నేను సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. దీంతో ఉదయ్ కిరణ్‍ను మరోసారి వెండితెరపై చూసే అవకాశం దక్కనుంది. ఈ చిత్రం ఎప్పుడు రీ-రిలీజ్ కానుందంటే..
Nuvvu Nenu Movie: దివంగత సినీ హీరో ఉదయ్ కిరణ్ కెరీర్లో ‘నువ్వు నేను’ చిత్రం భారీ బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచింది. 2001లో రిలీజైన ఈ చిత్రం ఉదయ్‍ను హీరోగా నిలబెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అయింది. రెండో మూవీతోనే అతడు స్టార్ అయ్యాడు. స్టార్ డైరెక్టర్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ నువ్వు నేను సినిమా మళ్లీ 23 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా రీ-రిలీజ్ డేట్ ఖరారైంది.
రీ-రిలీజ్ డేట్
నువ్వు నేను సినిమా మార్చి 21వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ ఈ మూవీని మార్చి 21న రీ రిలీజ్ చేస్తోంది.
నువ్వు నేను గురించి..
ఎమోషనల్ లవ్ డ్రామాగా నువ్వు నేను చిత్రాన్ని దర్శకుడు తేజ తెరకెక్కించిన విధానం యూత్‍ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ యాక్టింగ్ అందరినీ మెప్పించింది. ఈ చిత్రంలో అనిత హసనందానీ హీరోయిన్‍గా నటించారు. కాలేజీలో ధనవంతుడైన అబ్బాయి, మధ్యతరగతి అమ్మాయి ప్రేమించుకోవడం.. పెద్దలు అంగీకరించకపోవడం.. అందరినీ ఎదిరించి, కష్టాలను దాటుకొని వారిద్దరూ పెళ్లి చేసుకోవడం చుట్టూ నువ్వు నేను మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో లవ్ స్టోరీ, కామెడీ, ఎమోషన్స్, పాటలు.. ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నాయి.
నువ్వు నేను సినిమా 2001 ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయింది. అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. అయితే, ఓపెనింగ్ పెద్దగా రాకపోయినా ఆ తర్వాత పాజిటివ్ మౌత్ టాక్‍తో ఈ చిత్రం సత్తాచాటింది. భారీగా కలెక్షన్లను సాధించి బ్లాక్ బాస్టర్ అయింది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మెప్పించిన మ్యూజిక్
నువ్వు నేను చిత్రానికి ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం కూడా అతిపెద్ద బలంగా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. యూత్‍ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించడంలో పాటలది కూడా కీలకపాత్రగా ఉంది. ఈ చిత్రంలో డైలాగ్‍లు కూడా మెప్పించాయి. సునీల్ కామెడీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నువ్వు నేను సినిమాలో సునీల్, బెనర్జీ, తనికెళ్ల భరణి, తెలంగాణ శకుంతల, రాధిక చౌదరి, సుప్రియ కార్నిక్, ఎంఎస్ నారాయణ కీలకపాత్రలు పోషించారు.
ప్రస్తుతం తెలుగులో రీ-రీలీజ్‍ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు కల్ట్ క్లాసిక్‍గా నిలిచిన నువ్వు నేను మూవీ ఏకంగా 23 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తుండడంతో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. అందులోనూ ఉదయ్ కిరణ్‍ను మళ్లీ వెండి తెరపై చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది.
వరుసగా సినిమాలు ఫ్లాఫ్‍లు అవడం.. అవకాశాలు రాక డిప్రెషన్‍లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ 2014 జనవరిలో ఆత్మహత్య చేసుకున్నారు. 33 ఏళ్ల వయసులోనే ఆయన మరణించారు. ఆయన మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.