TV Serial Actress: అవును.. నేను విడాకులు తీసుకున్నా..: త్రినయని నటి ఇన్‌స్టా పోస్ట్ వైరల్
TV Serial Actress: తెలుగు టీవీ సీరియల్ నటి, త్రినయని ఫేమ్ చైత్ర హల్లికెరి చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. తన విడాకులకు సంబంధించిన ఈ పోస్ట్ పై అభిమానులు చర్చించుకుంటున్నారు.
TV Serial Actress: జీ తెలుగులో వచ్చే త్రినయని సీరియల్ ఫేమ్ చైత్ర హల్లికెరి తన విడాకుల విషయంలో కొన్నాళ్లుగా అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇచ్చింది. సోమవారం (నవంబర్ 18) ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతోంది. కొన్నాళ్లుగా ఈ విషయంలో తాను ఎంతో విద్వేషాన్ని, అసభ్యకర కామెంట్స్ ఎదుర్కొంటున్నట్లు అందులో చైత్ర తెలిపింది.
అవును.. విడాకులు తీసుకున్నాను..
త్రినయని సీరియల్లో నటించే చైత్ర హల్లికెరి తొలిసారి తన విడాకులపై స్పందించింది. "ఇవాళ నేను అందరికీ ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నన్ను ఇన్‌స్టా, ఎఫ్‌బీ డైరెక్ట్ మెసేజ్ లలో అందరూ అడుగుతున్న ప్రశ్న.. అవును.. నేను విడాకులు తీసుకున్నాను.
దీనిపై ఎంతో మంది ఏవేవో నా గురించి అనుకున్నారు. అయినా నేను వీటిని పట్టించుకోలేదు. జీవితంలో మరింత బలంగా, తెలివిగా ఉండేలా నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. 17 ఏళ్లుగా నేను నిర్మించుకున్న జీవితం అసలు ఉనికిలో లేదు. ఆ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. నాకు ఎదురైన అవమానం, విద్వేషాలను పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నాను.
గత నాలుగేళ్లుగా నాకు అండగా ఉండి, నాపై చూపిన సానుకూల ప్రేమకు కృతజ్ఞతలు. జీవితంలో కష్ట కాలం మనవాళ్లెవరో చూపిస్తుంది. అందుకే కష్టాల్లోనూ ఓ ఆశారేఖ ఎప్పుడూ ఉంటుంది. నాలా కష్టాలు అనుభవిస్తున్న వాళ్లందరికీ ఒకటే చెబుతున్నాను.. మిమ్మల్ని మీరు ఎంచుకోండి.. ఎందుకంటే మీరే ఆ పని చేయకపోతే ఇంకా ఎవరూ చేయరు" అని చైత్ర ఆ పోస్టులో రాసింది.
ఎవరీ చైత్ర హల్లికెరి?
జీ తెలుగులో వస్తున్న త్రినయని సీరియల్లో తిలోత్తమ అనే పాత్రలో చైత్ర నటిస్తోంది. అంతకుముందు పవిత్రా జయరాం ఈ పాత్రలో నటించేది. కానీ ఆమె ఓ ప్రమాదంలో కన్ను మూసిన తర్వాత చైత్ర అడుగుపెట్టింది. ఈమె కూడా కన్నడ నటే. 2003లో వచ్చిన వెల్ డన్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత పలు కన్నడ సినిమాల్లో నటించింది. 2006లో వ్యాపారవేత్త బాలాజీని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. 2021లో వీళ్లు విడిపోయారు. ఆ విడాకుల తర్వాత గత నాలుగేళ్లలో తాను ఎన్నో వేధింపులు, అవమానాలు ఎదుర్కొన్నట్లు తాజాగా చైత్ర వెల్లడించింది.