Flashback Trivikram Sunil: త్రివిక్రమ్...సునీల్ - ఈ బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్లి ఒకేరోజు జరిగింది
Flashback Trivikram Sunil: టాలీవుడ్‌లోని బెస్ట్ ఫ్రెండ్స్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్, కమెడియన్ సునీల్ ఒకరు. ఈ ఇద్దరు ఒకే టైమ్‌లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రూమ్‌మేట్స్‌గా ఉన్నారు. అంతే కాకుండా ఈ ఇద్దరు ప్రాణ స్నేహితుల పెళ్లి ఒకే రోజు హైదరాబాద్‌లోనే జరగడం గమనార్హం.
Flashback Trivikram Sunil: అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, కమెడియన్ సునీల్ మధ్య స్నేహం టాలీవుడ్‌లోని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సినిమా అవకాశాలు కోసం హైదరాబాద్ వచ్చిన త్రివిక్రమ్, సునీల్ రూమ్‌మేట్స్‌గా చాలా కాలం పాటు కొనసాగారు. ఒకే రూమ్‌లో ఉంటూ రైటర్‌గా త్రివిక్రమ్, యాక్టర్‌గా సునీల్ అవకాశాలు కోసం ప్రయత్నించారు.
తమ స్నేహానికి గుర్తుగా కెరీర్ ప్రారంభంలో ఉన్న బ్యాచ్‌లర్ రూమ్‌ను ఇప్పటికీ అలాగే ఉంచినట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు ప్రాణ స్నేహితుల పెళ్లి ఒకే రోజు జరగడం గమనార్హం. త్రివిక్రమ్ వివాహం 2002 అక్టోబర్ 11న దివంగత గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమార్తె సాయి సౌజన్యతో హైదరాబాద్‌లో జరిగింది.
అదే రోజు సునీల్ వివాహం కూడా జరగడం గమనార్హం. శృతి మెడలో అక్టోబర్ 11న సునీల్ తాళికట్టారు. త్రివిక్రమ్ పెళ్లికి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయినిగమాగం పెళ్లి వేదికగా నిలవగా...సునీల్ పెళ్లి శిల్పారామంలోని సైబర్ గార్డెన్స్‌లో జరిగింది. కాకతాళీయంగా ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే రోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
స్వయంవరం సినిమాతో రైటర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు త్రివిక్రమ్. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారారు. నువ్వే నువ్వే తో పాటు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన, నువ్వు నాకు నచ్చావ్, ఖలేజా, జల్సాతో పాటు ప్రతి సినిమాలో సునీల్ తప్పకుండా కనిపిస్తాడు. సునీల్‌లోని కామెడీ టైమింగ్ త్రివిక్రమ్ సినిమాల ద్వారానే వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలా వైకుంఠపురములతో తర్వాత అల్లు అర్జున్‌తో మరో సినిమా చేయబోతున్నాడు. మరోవైపు కమెడియన్‌గా రీఎంట్రీ ఇచ్చిన సునీల్ తెలుగు కంటే ఎక్కువగా తమిళంలోనే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల రిలీజైన రజనీకాంత్ జైలర్‌లో ఈ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. విశాల్ మార్క్ ఆంటోనీలోనూ సునీల్ నటిస్తున్నాడు.