Trivikram Son: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న తివ్రిక్రమ్ తనయుడు.. విజయ్ దేవరకొండ మూవీతోనే..
Trivikram Son: ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు రిషి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా విజయ్ దేవరకొండ సినిమాతో కావడం విశేషం.
Trivikram Son: టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తర్వాత డైరెక్టర్ గా మారి ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడతడి పెద్ద కొడుకు రిషి కూడా తండ్రి బాటలోనే వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు కూడా సినిమాల్లోకి రాబోతున్నాడట.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా రిషి
ఏ సినిమా ఇండస్ట్రీ అయినా వారసులు కామనే. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు తమ పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. కొందరు కెమెరా ముందుకు వస్తే.. మరికొందరు కెమెరా వెనుక పనులు చూసుకుంటున్నారు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పెద్ద కొడుకు రిషి కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. అయితే అది నటుడిగా కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కావడం విశేషం.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీకి రిషి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అంటూ అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
తిరుమలలో త్రివిక్రమ్ ఫ్యామిలీ
త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అలిపిరి నుంచి కాలి నడకన వెళ్లి దర్శనం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. చాలా వరకు తన ఫ్యామిలీతో త్రివిక్రమ్ కనిపించడు. కానీ తిరుమలలో మాత్రం తన ఇద్దరు కొడుకులతో కలిసి అతడు ఫొటోలకు పోజులిచ్చాడు. అందులో పెద్ద కొడుకు రిషిని చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు.
ఈ ఫొటోల్లో రిషి చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. దీంతో త్వరలోనే అతడు హీరోగా సినిమాల్లో అడుగుపెడతాడని కూడా అందరూ భావించారు. కానీ రిషి మాత్రం ప్రస్తుతానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా రాబోతున్నాడు. భవిష్యత్తులో అతడు నటుడు అవుతాడా లేక డైరెక్షన్ వైపే వెళ్తాడా అన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు త్రివిక్రమ్ మాత్రం తన నెక్ట్స్ మూవీ అల్లు అర్జున్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
త్రివిక్రమ్ చివరిగా మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం మూవీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఊహించినంతగా సక్సెస్ కాలేకపోయింది. ఈ మూవీ చూసిన చాలా మంది ప్రేక్షకులు త్రివిక్రమ్ పనైపోయిందని, అతని మార్క్ కనిపించలేదన్న కామెంట్స్ చేశారు.
త్రివిక్రమ్ కెరీర్
త్రివిక్రమ్ కూడా మొదట్లో డైరెక్టర్ కావాలనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట్లో సహ రచయితగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత 1999లో వచ్చిన స్వయంవరం మూవీతో రచయితగా మారాడు. తర్వాత నువ్వే కావాలి, చిరునవ్వుతో, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సూపర్ సినిమాలకు మాటల రచయితగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.
2002లో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. అక్కడి నుంచి త్రివిక్రమ్ కెరీర్ మారిపోయింది. మహేష్ బాబుతో అతడు, పవన్ కల్యాణ్ తో జల్సాలాంటి సినిమాలతో స్టార్ దర్శకుడిగా ఎదిగాడు.