Top Gear Movie Review: టాప్ గేర్ మూవీ రివ్యూ - ఆది సాయికుమార్ సినిమా ఎలా ఉందంటే
Top Gear Movie Review: ఆదిసాయికుమార్, రియా సుమన్ జంటగా నటించిన టాప్ గేర్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Top Gear Movie Review: ఈ ఏడాది ఆది సాయికుమార్ జోరు మామూలుగా లేదు. ఇప్పటికే అతడు నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా టాప్ గేర్ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు శశికాంత్ దర్శకత్వం వహించాడు. శ్రీధర్‌రెడ్డి నిర్మించారు. రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. టాప్ గేర్ సినిమాతో ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా?అతడికి ఈ సినిమా ఎలా ఫలితాన్ని అందించిందో చూద్ధాం.
క్యాబ్ డ్రైవర్ కథ...
అర్జున్ (ఆది సాయికుమార్) ఓ క్యాబ్ డ్రైవర్. ఆద్యతో (రియా సుమన్) పెళ్లవుతుంది. సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలుపెడతారు. సిద్ధార్థ్ (మైమ్ గోపి)ముంబాయికి చెందిన పెద్ద డ్రగ్ డీలర్. అతడికి చెందిన కోట్ల విలువైన డ్రగ్స్ హైదరాబాద్‌లో చిక్కుకుంటాయి. ఆ డ్రగ్స్‌తో సింగపూర్ పారిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు సిద్ధార్థ్.
అనుకోకుండా సిద్ధార్థ్ ప్లాన్‌లో అర్జున్ చిక్కుకుంటాడు. అతడి క్యాబ్ నుంచి డ్రగ్స్ బ్యాగ్ మిస్ అవుతుంది. ఈ బ్యాగ్ కోసం సిద్ధార్థ్ గ్యాంగ్ అర్జున్ వెంట పడతారు. బ్యాగ్ ఇవ్వకపోతే ఆద్యను చంపేస్తామని బెదిరిస్తారు. సిద్ధార్థ్ ప్లాన్‌లో అర్జున్ ఎలా భాగమయ్యాడు? ఆ గ్యాంగ్ బారి నుంచి తన భార్య ఆద్యను ఎలా కాపాడుకున్నాడు? సిద్ధార్థ్ పట్టుకోవాలనే ఏసీపీ విక్రమ్ (శత్రు) ప్రయత్నం ఫలించిందా లేదా అన్నదే ఈ సినిమా కథ.
పద్మవ్యూహం నుంచి...
సంబంధం లేని క్రైమ్‌లో అమాయకుడైన హీరో చిక్కుకోవడం ఆ పద్మవ్యూహం నుంచి తన ధైర్యసాహసాలు, తెలివితేటలతో బయటపడటం అనే పాయింట్‌తో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. టాప్ గేర్ అలాంటి సినిమానే. కానీ రొటీన్ పాయింట్‌కు కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు శశికాంత్. అర్జున్, ఆద్య జీవితం, డ్రగ్స్ బ్యాక్‌డ్రాప్ రెండు కథల్ని వేర్వురుగా మొదటుపెట్టి వాటిని ఒక్కటిగా లింక్ చేసిన విధానం బాగుంది.
ఎంగేజింగ్...
అర్జున్, ఆద్య ప్రేమకథతో సింపుల్‌గా ఈ సినిమా మొదలవుతుంది. సిద్ధార్థ్‌ను పట్టుకోవడానికి ఏసీపీ విక్రమ్ చేసే ప్రయత్నాలు, పోలీసులకు దొరక్కుండా అతడు వేసే ఎత్తులతో ఫస్ట్ హాఫ్‌ను నడిపించారు. అర్జున్ క్యాబ్‌లోకి డ్రగ్స్ చేరిన తర్వాతే కథ వేగంగా పరుగులు పెడుతుంది. ఆ బ్యాగ్ మిస్ కావడం అతడిని సిద్ధార్థ్ గ్యాంగ్‌తో పాటు పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలను ఎంగేజింగ్‌గా చూపించారు.
ఒక్క నైట్‌లోనే...
ఒక్క నైట్‌లోనే జరిగే కథ ఇది. అందుకు తగ్గట్లుగా ట్విస్ట్‌లను దర్శకుడు బాగానే రాసుకున్నా చాలా వరకు ఊహలకు అందేలా సాగుతాయి. డ్రగ్ డీలర్ సిద్ధార్థ్‌ను పట్టుకోవడానికి పోలీసులు వేసే ఎత్తులు లాజిక్స్‌కు దూరంగా సాగుతాయి.
హీరోను డామినేట్ చేసే విలన్..
పెద్ద క్రైమ్‌లో చిక్కుకున్న సాధారణ క్యాబ్ డ్రైవర్‌గా ఆది సాయికుమార్ పరిణితితో కూడిన నటనను కనబరిచాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఈజ్‌తో నటించాడు. ఆద్యగా రియా సుమన్ పాత్రకు తగ్గట్లుగా కనిపించింది. మైమ్ గోపీ విలనిజం రొటీన్‌గా ఉంది. అయితే హీరోను డామినేట్ చేసేలా అతడి క్యారెక్టర్ డిజైన్ చేయడం బాగుంది. ఏసీపీ విక్రమ్‌గా శత్రు పర్వాలేదనిపించాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది. చాలా చోట్ల మ్యూజిక్‌తో కథలోని థ్రిల్ ఫీల్‌ను ఎలివేట్ చేశాడు.
మినిమం టైమ్‌పాస్
టాప్ గేర్ టైటిల్ తగ్గట్లుగానే ఫస్ట్ ఫేజ్‌తో సాగే యాక్షన్ సినిమా అనుకుంటే కొంత నిరాశ తప్పదు. కథ, కథనాల్లో కొత్తదనం లోపించింది. మినిమం టైమ్‌పాస్‌ను మాత్రం ఈ సినిమా గ్యారెంటీగా అందిస్తుంది.
రేటింగ్ : 2.75/5