OTT Hollywood: ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రూ.4వేల కోట్ల కలెక్షన్ల చిత్రం.. ఎప్పుడు, ఎక్కడ?
OTT Hollywood: వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ చిత్రం ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటి వరకు కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు పూర్తిస్థాయి ఓటీటీ రిలీజ్‍కు రానుంది.
హాలీవుడ్‍లో వెనమ్ చిత్రాలు చాలా పాపులర్. ఈ ఫ్రాంచైజీలో మూడో మూవీగా ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ గతేడాది అక్టోబర్‌లో రిలీజ్ అయింది. ఈ సూపర్ హీరో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా భారీ కలెక్షన్లను దక్కించుకుంది. ఇండియాలోనూ మంచి వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే రెంటల్ విధానంలో కొన్ని ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందా అని కొందరు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ పూర్తిస్థాయి స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది.
స్ట్రీమింగ్ వివరాలివే..
‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనుంది. ఈ చిత్రం జనవరి 25న తేదీన స్ట్రీమింగ్‍కు రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై నెట్‍ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఈ చిత్రం బుక్ మై షో, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో రెంట్ విధానంలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. దీంతో నెట్‍ఫ్లిక్స్ సబ్‍స్క్రైబర్లందరూ రెంట్ లేకుండా ఆ మూవీని చూసే అవకాశం ఉంటుంది.
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ చిత్రంలోనూ టామ్ హార్డ్లీ హీరోగా నటించారు. చివెటెల్ ఎజియోఫర్, జునో టెంపుల్, రిన్స్ ఇఫాన్స్, స్టీఫెన్ గ్రాహం, పెగ్గీ లూ, క్లార్క్ బాకో, అలనా ఉబాచ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి కెల్లీ మార్కెల్ దర్శకత్వం వహించారు. మార్వెల్ కామిక్స్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ కలెక్షన్లు
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సినిమా సుమారు 120 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,000 కోట్లు) బడ్జెట్‍తో రూపొందింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లను దక్కించుకుంది. మొత్తంగా సుమారు 476 మిలియన్ డాలర్ల (సమారు రూ.4వేల కోట్లు) కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని కొలంబియా పిస్చర్స్, మార్వెల్, అరద్ ప్రొడక్షన్స్, మాట్ టోల్మాచ్ ప్రొడక్షన్స్, పాస్కల్ పిక్చర్స్, టీఎస్‍జీ ఎంటర్‌టైన్‍మెంట్, మార్కెల్ హార్డీ ప్రొడక్షన్స్, హచ్ పార్కర్ ఎంటర్‌టైన్‍మెంట్, హార్డ్లీ సన్, బేకర్ బ్యానర్లు నిర్మించాయి.
ఇటీవల హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా ‘ట్రాప్’ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. గతంలో వివిధ ఓటీటీలో రెంట్‍కు వచ్చిన ఈ మూవీ.. జియోసినిమాలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో జోష్ హార్ట్‌నెట్ లీడ్ రోల్ పోషించగా.. నైట్ ష్యామలాన్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం