Krishnaveni: టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి కృష్ణ‌వేణి క‌న్నుమూత - బాల‌కృష్ణ సంతాపం-tollywood veteran actress krishnaveni passes away who introduced ntr with manadesam movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishnaveni: టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి కృష్ణ‌వేణి క‌న్నుమూత - బాల‌కృష్ణ సంతాపం

Krishnaveni: టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి కృష్ణ‌వేణి క‌న్నుమూత - బాల‌కృష్ణ సంతాపం

Nelki Naresh HT Telugu
Published Feb 16, 2025 12:27 PM IST

Krishnaveni: టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి, నిర్మాత కృష్ణ‌వేణి ఆదివారం క‌న్నుమూశారు. మ‌న‌దేశం మూవీతో ఎన్టీఆర్‌ను తెలుగు ఇండ‌స్ట్రీకి కృష్ణ‌వేణి ప‌రిచ‌యం చేశారు. ద‌క్ష‌య‌జ్ఞం, జీవ‌న జ్యోతి, గొల్ల‌భామ‌తో పాటు ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది కృష్ణ‌వేణి. ప్రొడ్యూస‌ర్‌గా మూడు సినిమాలు చేశారు.

కృష్ణ‌వేణి
కృష్ణ‌వేణి

Krishnaveni: టాలీవుడ్ సీనియర్ న‌టి, నిర్మాత కృష్ణవేణి క‌న్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ‌వేణి ఆదివారం ఉద‌యం తుది శ్వాస విడిచింది. కృష్ణ‌వేణి వయసు 101 సంవత్సరాలు. డిసెంబర్ 24, 1924 లో కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో కృష్ణ‌వేణి జ‌న్మించారు. రంగ‌స్థ‌ల క‌ళాకారిణిగా ఆమె న‌ట జీవితం మొద‌లైంది. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సి. పుల్లయ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సతీ అనసూయ సినిమాతో 1936లో బాల‌న‌టిగా సినిమా రంగానికి పరిచయమైంది కృష్ణ‌వేణి.

హీరోయిన్‌గా...నిర్మాత‌గా...

కథానాయికగా ద‌క్ష‌య‌జ్ఞం, జీవ‌న‌జ్యోతి, భీష్మ‌, ఆహుతి, గొల్ల‌భామ‌, మ‌ళ్లీ పెళ్లి, తిరుబాటు, పేరంటాలుతో పాటు ప‌లు సినిమాలు చేసింది కృష్ణ‌వేణి. నిర్మాత‌గా మ‌న‌దేశంతో పాటు ల‌క్ష్మ‌మ్మ‌, భ‌క్త ప్ర‌హ్లాద‌, దాంప‌త్యం సినిమాల‌ను తెర‌కెక్కించింది. బాల‌మిత్రుల క‌థ‌, కీలు గుర్రం సినిమాల కోసం గాయ‌నిగా మారింది. క‌థానాయిక‌గా కొన‌సాగుతోన్న‌ప్పుడే కృష్ణ‌వేణికి మీర్జాపురం రాజా వారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత అత‌డినే పెళ్లిచేసుకున్న‌ది.

మ‌న‌దేశం మూవీతో...

1949లో మనదేశం అనే సినిమాలో నందమూరి తారక రామారావును(ఎన్టీఆర్‌) తెలుగు సినిమా రంగానికి న‌టుడిగా కృష్ణ‌వేణినే ప‌రిచ‌యం చేశారు. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మీర్జాపురం రాజా, మేక రంగయ్య నిర్మించారు. ఈ సినిమాలో కృష్ణ‌వేణి హీరోయిన్‌గా న‌టించ‌డం గ‌మ‌నార్హం. శోభ‌నాచ‌ల స్టూడియోస్‌కు అధినేత‌గా చాలా కాలం పాటు కొన‌సాగారు. మ‌న‌దేశం సినిమాతో ఎన్టీఆర్‌తో పాటు దిగ్గ‌జ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఘంట‌సాల కూడా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యారు.

మీర్జాపురం రాజా, కృష్ణ‌వేణి దంప‌తుల‌కు మేక రాజ్యలక్మి అనురాధ జన్మించారు. అనురాధ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. 2004లో కృష్ణవేణిని రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు కృష్ణ‌వేణి.

బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి...

నందమూరి తారక రామారావు గారి నటజీవితానికి తొలుత అవకాశం అందించిన కృష్ణవేణి గారు సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందడం బాధాకరం.

శ్రీమతి కృష్ణవేణి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం. మన దేశం లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి కృషి చేశారు.ది.కృష్ణవేణి గారి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని బాల‌కృష్ణ సంతాపం వ్య‌క్తం చేశారు

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం