Formula e Racing Hyderabad: ఫార్ములా ఈ రేసింగ్‌కు టాలీవుడ్ చేయూత - రేసింగ్ పోటీలు విజయవంతం కావాలని పిలుపు
Formula e Racing Hyderabad: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 11న నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసింగ్ విజయవంతం కావాలని టాలీవుడ్ స్టార్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రేసింగ్‌ను నిర్వహిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు.
Formula e Racing Hyderabad: మరో ప్రఖ్యాత స్పోర్ట్స్ ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఇండియాలో తొలిసారి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ వేదికగా జరుగనుంది. ఫిబ్రవరి 11న జరుగనున్న గ్రీన్ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఈవెంట్ విజయవంతంగా కావాలని టాలీవుడ్ అగ్ర నాయకానాయికలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
చిరంజీవి, ప్రభాస్, మహేష్‌బాబు, విజయ్ దేవరకొండతో టాలీవుడ్ అగ్ర నాయకానాయికందరూ ఫార్ములా ఈ రేస్‌కు బాసటగా నిలిచారు. తొలి ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగనుండటం గర్వకారణంగా ఉందని అగ్ర హీరో ప్రభాస్ పేర్కొన్నాడు.
చరిత్రలో నిలిచిపోయేలా…
హైదరాబాద్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా ఈ గ్రీన్ కో ఈ ప్రిక్స్ రేసింగ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాడు. పర్యావరణ హితమైన మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వంతో పాటు గ్రీన్ కో ఫౌండర్ అనిల్ చలంశెట్టిలపై ప్రభాస్ ప్రశంసలు కురిపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
దేశంలోనే ఫస్ట్ గ్రీన్ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనుండటం ఆనందంగా ఉందని చిరంజీవి పేర్కొన్నాడు. తొలి ఫార్ములా ఈ రేసింగ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన కేటీఆర్‌తో పాటు అనిల్ చలంశెట్టికి సోషల్ మీడియా వేదికగా నాగార్జున అభినందనలు తెలిపాడు.
ఫిబ్రవరి 11న జరుగనున్న ఈ ఈవెంట్‌ను చూసేందుకు అందరితో పాటు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. మహేష్‌బాబు సైతం ఈ ఫార్ములా రేసింగ్ పోటీల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ రేసింగ్‌ను విజయవంతం చేస్తూ వాతావరణ మార్పులపై గళాన్ని వినిపిద్ధాం అని సోషల్ మీడియా వేదికగా మహేష్‌బాబు ప్రకటించాడు.
నాగచైతన్య, అడివిశేష్, వెంకటేష్, పీవీ సింధుతో పాటు పలువురు సినీ నటులు, క్రీడాకారులు ఈ ఫార్ములా ఈ రేసింగ్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న తెలంగాణ ప్రభుత్వంతో పాటు గ్రీన్‌కో సంస్థపై అభినందనలు కురిపించారు.
ఫిబ్రవరి 11న…
ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ రేస్ జరుగనుంది. 10వ తేదీన ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించనున్నారు. ఈ రేస్‌లో 11 దేశాల నుంచి మొత్తం 22 మంచి డ్రైవర్లు పాల్గొననున్నారు. ఈ రేసింగ్ కోసం 18 మలుపులతో కూడిన 2.8 కిలోమీటర్ల పొడవైన స్పెషల్ ట్రాక్‌ను ఏర్పాటుచేశారు. పూర్తిగా ఎలక్ట్రానిక్ కార్లతో ఈ రేసింగ్ పోటీలను నిర్వహించబోతున్నారు.