Anantha Sriram: ఓనమాలు దిద్దకముందే నా ఆనవాళ్లు చూపించారు.. రచయిత అనంత శ్రీరామ్ కామెంట్స్-tollywood songs lyricist anantha sriram comments on journalist prabhu in revu movie audio launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anantha Sriram: ఓనమాలు దిద్దకముందే నా ఆనవాళ్లు చూపించారు.. రచయిత అనంత శ్రీరామ్ కామెంట్స్

Anantha Sriram: ఓనమాలు దిద్దకముందే నా ఆనవాళ్లు చూపించారు.. రచయిత అనంత శ్రీరామ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Anantha Sriram Revu Journalist Prabhu: తెలుగులో వస్తున్న మరో సరికొత్త సినిమా రేవు. ఇటీవల జరిగిన రేవు మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు అథితిగా హాజరైన పాటల రచయిత అనంత శ్రీరామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవు మూవీతోపాటు జర్నలిస్ట్ ప్రభుపై వ్యాఖ్యలు చేశారు అనంత శ్రీరామ్.

ఓనమాలు దిద్దకముందే నా ఆనవాళ్లు చూపించారు.. రచయిత అనంత శ్రీరామ్ కామెంట్స్

Anantha Sriram About Revu Movie: మత్స్యకారుల జీవన శైలిని చాటిచెప్పే చిత్రంగా తెలుగులో వస్తోన్న సినిమా రేవు. ఈ సినిమాలో వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జర్నలిస్ట్ ప్రభు నిర్మాణ సూపర్ విజన్ బాధ్యతలు నిర్వహించగా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు.

విచ్చేసిన గేయ రచయితలు

ఇటీవల రేవు మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాటల రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ అతిథులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఓనమాలు దిద్దకముందే

"మేము పాటలు రాయని ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చామంటే ప్రభు గారి మీద మాకెంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన.. నేను గీత రచయితగా ఓనమాలు దిద్దక ముందే నా ఆనవాళ్లు చూపించారు. నా కెరీర్ ప్రారంభం నుంచి తన ప్రోత్సాహం అందిస్తున్నారు. రేవు సినిమాలో పాటలు చాలా బాగున్నాయి" అని అనంత శ్రీరామ్ తెలిపారు.

నాలాగే మొదటి సినిమాకు

"గీత రచయితగా ఇమ్రాన్ శాస్త్రి నాలాగే మొదటి సినిమాకే సింగిల్ కార్డ్ రాసే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా కరుణ, రౌద్ర వంటి అనేక భావోద్వేగాలున్న పాటలు రాయడం అభినందనీయం. జాన్ సంగీతం బాగుంది. ఈ రేవు సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అని గేయ రచయిత అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.

ఉద్విగ్నతకు లోనయ్యా

ఇంకా ఈ ఈవెంట్‌లో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. "రేవు పాటలు విన్నాక ఒక ఉద్విగ్నతకు లోనయ్యాను. అంత బాగున్నాయి. మనం కంటెంట్ ఉన్న వైవిధ్యమైన సినిమాలు కావాలంటే పర భాషల వైపు చూస్తుంటాం. కానీ, రేవు సినిమా పాటలు విన్నాక కొత్తతరం ప్రతిభావంతులపై నమ్మకం ఏర్పడుతోంది. రేపటి తెలుగు సినిమా బాగుంటుందని అనిపిస్తోంది" అని అన్నారు.

ఇది మా దమ్ము

"ఇది మా దమ్ము అంటూ పాటల్ని చూపించి ఇది అనిపించుకున్నారు రేవు టీమ్. లిరిసిస్ట్ ఇమ్రాన్, మ్యూజిక్ చేసిన జాన్‌కు కంగ్రాట్స్. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే దర్శకుడు హరినాథ్‌కు శుభాకాంక్షలు. తెలుగు సంగీత దర్శకులకు అవకాశాలు రావాలి. అప్పుడే మనవారి ప్రతిభ తెలుస్తుంది" అని రామజోగయ్య శాస్త్రి చెప్పారు.

బాక్సాఫీస్ వద్ద రేవెట్టాలి

"ఈ సినిమాలో కొన్ని పాటలు లిరిక్స్‌కు ట్యూన్ చేశారని తెలిసింది. ఇంకా సంతోషం. ఈ రేవు సినిమా బాక్సాఫీస్ వద్ద రేవెట్టాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకు సారథ్యం వహిస్తున్న ప్రభు గారికి, పర్వతనేని రాంబాబు గారికి, ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు.

రేవు నటీనటులు

ఇదిలా ఉంటే, రేవు సినిమాలో వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరితోపాటు గురు తేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.