టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ ప్రొడ్యూసర్ మృతి.. శ్రీహరిని హీరోగా.. కాజల్ హీరోయిన్ గా పరిచయం చేసింది ఆయనే-tollywood senior producer kavuri mahendra died due to illness srihari kajal agarwal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ ప్రొడ్యూసర్ మృతి.. శ్రీహరిని హీరోగా.. కాజల్ హీరోయిన్ గా పరిచయం చేసింది ఆయనే

టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ ప్రొడ్యూసర్ మృతి.. శ్రీహరిని హీరోగా.. కాజల్ హీరోయిన్ గా పరిచయం చేసింది ఆయనే

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ రవి కుమార్ చౌదరి మరణించిన ఒక్క రోజు వ్యవధిలోనే సీనియర్ ప్రొడ్యూసర్ మహేంద్ర కన్నుమూశారు. శ్రీహరిని హీరోగా, కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా పరిచయం చేసింది ఆయనే.

మరణించిన ప్రొడ్యూసర్ మహేంద్ర (x/Gopichandh Malineni)

టాలీవుడ్ లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. మంగళవారం (జూన్10) రాత్రి స్టార్ డైరెక్టర్ రవి కుమార్ చౌదరీ మరణించగా.. బుధవారం (జూన్ 11) రాత్రి సీనియర్ ప్రొడ్యూసర్ కావూరి మహేంద్ర కన్నుమూశారు. మంచి సినిమాలు ప్రొడ్యూస్ మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న కావూరి మహేంద్ర తుదిశ్వాస విడిచారు. ఏఏ ఆర్ట్స్ అధినేత మహేంద్ర (79) నిన్న రాత్రి చనిపోయారు.

అనారోగ్యంతో

సీనియర్ ప్రొడ్యూసర్ కావూరి మహేంద్ర గత కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ వచ్చారు. ఆయన భార్య, కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కుమారుడు జీతు మరణంతో మహేంద్ర కుంగిపోయారు. మహేంద్రకు ప్రముఖ నిర్మాత, నటుడు మాదాల రవి అల్లుడు.

మంచి నిర్మాతగా

1946 ఫిబ్రవరి 4న గుడివాడ తాలూకు దోసపాడులో జన్మించిన కె.మహేంద్ర ముందుగా దర్శకత్వ శాఖలో శిక్షణ పొందారు. ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాక నిర్మాతగా మారారు. 1977లో ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ సినిమా ఆయనకు ప్రొడ్యూసర్ గా ఫస్ట్ ఫిల్మ్. ఏఏ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించారు మహేంద్ర. ఏఏ ఆర్ట్స్ తో పాటు గీతా ఆర్ట్ పిక్చర్స్ పతాకాలపై 36 చిత్రాలు నిర్మించారు.

‘ఏది పుణ్యం? ఏది పాపం?', 'ఆరని మంటలు', 'తోడు దొంగలు', 'బందిపోటు రుద్రమ్మ', 'ఎదురలేని మొనగాడు', 'ఢాకూరాణి', ప్రచండ భైరవి', 'కనకదుర్గ వ్రత మహాత్మ్యం', ‘దేవా’, ‘కూలీ’, ‘ఒక్కడే’, ’అమ్మ లేని పుట్టిల్లు’ తదితర సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

శ్రీహరిని హీరోగా

దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా పరియం చేస్తూ తీసిన ‘పోలీస్’ సినిమాకు మహేంద్రనే ప్రొడ్యూసర్. అలాగే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా చేసింది కూడా ఆయనే. ఆయన ప్రొడ్యూస్ చేసిన ‘లక్మీ కల్యాణం’ సినిమాతోనే కాజల్ తెరంగేట్రం చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కెరీర్ కు మహేంద్రనే మార్గనిర్దేశనం చేశారు.

డైరెక్టర్ షాక్

తన గురువు కె.మహేంద్ర మరణ వార్త వినగానే డైరెక్టర్ గోపీచంద్ మలినేని షాక్ అయ్యారు. ‘‘అంకితభావం ఉన్న ప్రొడ్యూసర్ మహేంద్ర మరణ వార్త వినగానే తీవ్రమైన బాధ కలిగింది. సినిమా పట్ల ఆయన తపన ఎప్పటికీ గుర్తుండిపోతోంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని గోపీచంద్ మలినేని ఎక్స్ లో పోస్టు పెట్టారు.

రిలీజ్ కాకపోవడంతో

కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన "అర్జున" సినిమా ప్రొడ్యూసర్ గా మహేంద్రకు చివరి చిత్రం. వివిధ కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ కాలేదు. దీంతో ఆయన ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా మరింత కుంగిపోయారు. విలువలతో కూడిన సీనియర్ నిర్మాతల్లో ఒకరైన మహేంద్ర మరణం పట్ల పలువురు చిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. మహేంద్ర స్వస్థలం గుంటూరు. వారి అంత్యక్రియలు అక్కడే ఈరోజు (జూన్ 12)న జరగనున్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం