Chalapathi Rao Death: టాలీవుడ్‌లో విషాదం - సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత
Chalapathi Rao Death: టాలీవుడ్ సీనియర్ సినీ నటుడు చలపతిరావు శనివారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశాడు. చలపతిరావు మరణంతో టాలీవుడ్‌లో విషాదం అలుముకుంది.
Chalapathi Rao Death: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు (78)శనివారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న చలపతిరావు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో చలపతిరావు దాదాపు 1200లకుపైగా సినిమాల్లో నటించాడు. హీరో కావాలనే ఆలోచనతో అవకాశాల్ని వెతుక్కుంటూ మద్రాస్ వెళ్లిన చలపతిరావు చివరకు విలన్‌గా మారాడు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో కథానాయకుడు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు.. ఈ సినిమాలో మునిసిపల్ కమీషనర్‌గా చిన్న పాత్ర చేశాడు ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగా కెరీర్ ఆరంభంలో ఐదారేళ్ల పాటు కేవలం ఆయన సినిమాల్లోనే నటించాడు చలపతిరావు. ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమాలో ఇంద్రుడు, జరా సంధుడు..ఇలా ఐదు పాత్రల్లో నటించాడు చలపతిరావు.
ట్రెండింగ్ వార్తలు
రేప్ సీన్లకు ఫేమస్...
దానవీర శూరకర్ణ విజయం చలపతిరావు కెరీర్‌ను మలుపుతిప్పింది. ఐదు పాత్రలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టడంతో విలన్‌గా అవకాశాలు పెరిగాయి. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా రేప్ సీన్లలో నటించాడు. రేప్ సీన్లతో కూడిన విలన్ క్యారెక్టర్ అనగానే చలపతిరావునే తీసుకునేవారు. ఈ విలన్ క్యారెక్టర్స్ కారణంగా చలపతిరావును చూసి ప్రేక్షకులు కూడా భయపడేవారట. అతడు ఉన్న హోటల్‌లో హీరోయిన్లు ఉండటానికి ఇష్టపడేవారు కాదని చలపతిరావు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఇరవై ఎనిమిదేళ్లకే భార్య దూరం…
చలపతిరావుకు 19 ఏళ్లకే పెళ్లయింది. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత అతడి భార్య ఓ ప్రమాదంలో కన్నుమూసింది. కానీ చలపతిరావు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. చలపతిరావు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు. అమ్మాయిలు అమెరికాలో సెటిల్ అవ్వగా, కుమారుడు రవిబాబు దర్శకుడిగా, నటుడిగా టాలీవుడ్‌లో కొనసాగుతున్నారు.
నిర్మాతగా…
నటుడిగానే కాకుండా నిర్మాతగా చలపతిరావు కొన్ని సినిమాలు చేశారు. ఆర్‌సీ క్రియేషన్స్ అనే బ్యానర్‌ను స్థాపించిన బాలకృష్ణతో కలియుగ కృష్ణుడు సినిమా చేశారు. ఆ తర్వాత కడప రెడ్డమ్మ, జగన్నాటకం వంటి సినిమాల్ని నిర్మించాడు.
నిన్నేపెళ్లాడతాతో కొత్త మలుపు…
నాగార్జున హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన నిన్నే పెళ్లాడతా సినిమా నటుడిగా చలపతిరావును కొత్త కోణంలో ఆవిష్కరించింది. అప్పటివరకు విలన్‌గా కనిపించిన అతడు సాఫ్ట్ క్యారెక్టర్స్‌కు న్యాయం చేయగలదని నిరూపించింది. ఈ సినిమా తర్వాత ఎక్కువగా తండ్రి, బాబాయ్ వంటి రోల్స్ చేస్తూ వస్తున్నారు చలపతిరావు.
బుధవారం అంత్యక్రియలు
చలపతిరావు భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం తనయుడు రవిబాబు ఇంట్లోనే ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు. చలపతిరావు కూతురు అమెరికా నుంచి వచ్చిన తర్వాత బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపున్నారు.