Re-release movies: రీ-రిలీజ్‍ల ధమాకా.. నెల వ్యవధిలో ఏకంగా ఆరు సినిమాలు మళ్లీ థియేటర్లలోకి..
Re-release movies: టాలీవుడ్‍లో రీ-రీలీజ్‍ల జోరు మరింత పెరిగింది. ఏకంగా నెల వ్యవధిలోనే ఆరు గత సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రానున్నాయి. అభిమానులను ఊపేయనున్నాయి.
తెలుగులో రీ-రిలీజ్‍ల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో హిట్ అయిన, క్లాసిక్‍గా నిలిచిన సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. స్పెషల్ సందర్భాల్లో రీ-రిలీజ్‍లు అవుతున్నాయి. రీ-రిలీజ్‍లకు అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. కాగా, ఆగస్టులో రీ-రిలీజ్‍ల ధమాకా మరింత ఎక్కువగా ఉండనుంది. నెల వ్యవధిలో (ఆగస్టు 2 - సెప్టెంబర్ 2) ఏకంగా ఆరు సినిమాలు థియేటర్లలో రీ-రిలీజ్ కానున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర, మహేశ్ బాబు చిత్రాలు రెండు ఉన్నాయి. రీ-రిలీజ్ సినిమాల తేదీలు సహా వివరాలు ఇక్కడ చూడండి.
ఎటో వెళ్లిపోయింది మనసు
నేచురల్ స్టార్ నాని, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా 2012లో థియేటర్లలోకి వచ్చింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్‍గా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఈ చిత్రం చాలా మంది మనసులను గెలిచింది. మాస్ట్రో ఇళయరాజా ఇచ్చిన పాటలు కూడా మేజిక్ చేశాయి. ఇప్పుడు, సుమారు పన్నెండేళ్ల తర్వాత ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన ఎటో వెళ్లి పోయింది మనసు సినిమా థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది.
ఒక్కడు, మురారి
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆగస్టు 9న తన 49వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ స్పెషల్ సందర్భంగా ఏకంగా రెండు సినిమాలు రీ-రిలీజ్ కానున్నాయి. బ్లాక్‍బస్టర్ మూవీ ఒక్కడు చిత్రం ఆగస్టు 8వ తేదీన మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. మహేశ్ బాబు సరసన భూమిక చావ్లా.. ఒక్కడు చిత్రంలో హీరోయిన్‍గా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఆగస్టు 8న ఈ మూవీని మరోసారి వెండితెరపై చూడొచ్చు.
మహేశ్ బాబు, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించిన మురారి సినిమా ఓ క్లాసిక్‍గా నిలిచింది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2001లో రిలీజై ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ అయింది. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రీ-రిలీజ్ కానుంది. మహేశ్ పుట్టిన రోజున మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.
ఇంద్ర
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. 2002లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‍గా నిలిచింది. డైరెక్టర్ బీ.గోపాల్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్‍డ్రాప్ చిత్రం సూపర్ హిట్‍గా నిలిచింది. ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్‍లు ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటాయి. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఇంద్ర ఇప్పుడు మళ్లీ రీ-రిలీజ్ కానుంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన మళ్లీ ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
శివ
తన తొలి సినిమా ‘శివ’తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కింగ్ నాగార్జున, అమల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 1989లో విడుదలై భారీ హిట్ సాధించింది. ఈ చిత్రంతో ఆర్జీవీ ఓ ట్రెండ్ సెట్ చేశారు. సినిమాల గతిని ఓ విధంగా మార్చేశారు. ఈ క్లాసిక్ మూవీ ‘శివ’ 25 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. నాగార్జున పుట్టిన రోజైన ఆగస్టు 29వ తేదీన ఈ చిత్రం రీ-రిలీజ్ కానుంది.
గబ్బర్ సింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఏదాది సెప్టెంబర్ 2వ తేదీన తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆరోజున బ్లాక్‍బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో 2012లో వచ్చిన ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టింది. పవన్ మేనరిజమ్స్, డైలాగ్స్, యాక్షన్ ఊపేశాయి. ఈ మూవీని బండ్ల గణేశ్ నిర్మించగా.. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. పన్నెండేళ్ల తర్వాత గబ్బర్ సింగ్ మరోసారి వెండితెరపైకి వస్తోంది. సెప్టెంబర్ 2న రీ-రిలీజ్ కానుంది.
వీటికంటే ముందు ఈ వారంలోనే విక్రమార్కుడు చిత్రం రీ-రిలీజ్ అవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2006లో వచ్చిన సెన్సేషనల్ హిట్ అయింది. ఈ చిత్రం జూలై 27న రీ-రిలీజ్ కానుంది.