పెద్ద హీరోలూ.. మీరు రెండు, మూడేళ్లకో సినిమా చేస్తే థియేటర్లు మూతపడతాయ్.. మనం తర్వాత కొట్టుకుందాం: టాలీవుడ్ నిర్మాత-tollywood producer bunny vas comments on theatres closing advises star heroes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  పెద్ద హీరోలూ.. మీరు రెండు, మూడేళ్లకో సినిమా చేస్తే థియేటర్లు మూతపడతాయ్.. మనం తర్వాత కొట్టుకుందాం: టాలీవుడ్ నిర్మాత

పెద్ద హీరోలూ.. మీరు రెండు, మూడేళ్లకో సినిమా చేస్తే థియేటర్లు మూతపడతాయ్.. మనం తర్వాత కొట్టుకుందాం: టాలీవుడ్ నిర్మాత

Hari Prasad S HT Telugu

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ కీలకమైన కామెంట్స్ చేశాడు. పెద్ద హీరోలు రెండు, మూడేళ్లకో సినిమా తీయడం సరికాదని అన్నాడు. మనం తర్వాత కొట్టుకుందాం.. ముందు థియేటర్లు మూతపడకుండా ఏం చేయాలో చూడండని అతడు ట్వీట్ చేయడం గమనార్హం.

పెద్ద హీరోలూ.. మీరు రెండు, మూడేళ్లకో సినిమా చేస్తే థియేటర్లు మూతపడతాయ్.. మనం తర్వాత కొట్టుకుందాం: టాలీవుడ్ నిర్మాత

ప్రముఖ తెలుగు సినిమా నిర్మాతల్లో ఒకరు బన్నీ వాస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దగ్గరి వాడు. అలాంటి నిర్మాత ఇప్పుడు తన ఎక్స్ అకౌంట్లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అటు ఎగ్జిబిటర్లు, ఇటు ప్రొడ్యూసర్లకు కీలకమైన సూచన చేశాడు. వాటాల సంగతి తర్వాత.. ముందు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే మార్గం ఆలోచించండని అనడం గమనార్హం.

బన్నీ వాస్ ఏమన్నాడంటే?

కొన్నాళ్లుగా ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలుసు కదా. లాభాల్లో పర్సెంటేజీ కోసం ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. ఇదే విషయమై జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉంటుందన్న వార్తలూ వచ్చాయి.

అది కాస్తా తీవ్ర రూపం దాల్చి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వరకూ వెళ్లింది. అయితే ఈ అంశంపై తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్పందించాడు. తన ఎక్స్ అకౌంట్లో శుక్రవారం (జూన్ 6) ఓ పోస్ట్ చేశాడు. అందులో ఏముందో చూడండి.

ముందు అది ఆలోచించండి

“ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి.

ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది” అని బన్నీ వాస్ అన్నాడు.

టాలీవుడ్ లో ఎగ్జిబిటర్లు రెంట్ విధానంలోనే సినిమాలను ఆడిస్తున్నారు. అయితే దీనివల్ల తమకు పెద్దగా ఏమీ ఒరగడం లేదని, అందుకే లాభాల్లో వాటా కావాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైనే కొన్నాళ్లుగా ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం