Manchu Manoj: తండ్రైన హీరో మంచు మనోజ్ - చిన్నారికి ఎమ్ఎమ్ పులిగా నిక్‌నేమ్ - మంచు లక్ష్మి ట్వీట్
Manchu Manoj: మంచు మనోజ్ తండ్రయ్యాడు. మనోజ్ భార్య మౌనిక శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ చిన్నారికి ఎమ్ఎమ్ పులి అనే నిక్‌నేమ్ పెట్టినట్లు మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తండ్రయ్యాడు. అతడి భార్య మౌనిక శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోదరి, నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ చిన్నారికి ఎమ్ఎమ్ పులి అనే నిక్ నేమ్ పెట్టినట్లు మంచు లక్ష్మి తెలిపింది. శివుడి ఆశీస్సులతో తమ ఇంట్లోకి ఓ చిన్నారి దేవత అడుగుపెట్టినట్లు మంచు లక్ష్మి ఈ ట్వీట్‌లో పేర్కొన్నది. ఎమ్ఎమ్ పులి రాకతో అన్నగా మారిన ధైరవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని మంచు లక్ష్మి చెప్పింది. మంచు లక్ష్మి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత ఏడాది మార్చిలో పెళ్లి...
మంచు మనోజ్, మౌనిక గత ఏడాది మార్చిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిల్మ్ నగర్‌లోని మోహన్‌బాబు(Mohanbabu) ఇంటిలోనే మనోజ్, మౌనిక పెళ్లి జరిగింది. మనోజ్, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు.మనోజ్‌తో పాటు మౌనికకు ఇది రెండో వివాహం. 2015లో ప్రణతిని ప్రేమించి పెళ్లాడాడు మనోజ్. మనస్పర్థలతో 2019లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. మౌనిక కూడా తన మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆమెకు ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు.
ఉస్తాద్‌తో రీఎంట్రీ...
2004లో రిలీజైన దొంగ దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ప్రయాణం, బిందాస్, కరెంట్ తీగ, వేదంతో పాటు పలు సినిమాలు చేశాడు. 2017లో రిలీజైన ఒక్కడు మిగిలాడు తర్వాత తెలుగు సినిమాలకు దూరమయ్యాడు మంచు మనోజ్. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఇటీవలే ఉస్తాద్ అనే టాక్ షోతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన ఈ టాక్ షో ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది...
మల్టీస్టారర్ మూవీ...
. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టాడు మంచు మనోజ్. వాట్ ది ఫిష్ పేరుతో ఓ మూవీని అనౌన్స్‌చేశాడు . కానీ అనివార్య కారణాల వల్ల అతడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచు మనోజ్ స్థానంలో నిహారిక కొణిదెల ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చినట్లు సమాచారం. తేజా సజ్జా, దుల్కర్ సల్మాన్‌లతో మంచు మనోజ్ ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి ఈగల్ ఫేమ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. వీటితో పాటు మరో రెండు సినిమాలు చర్చలు దశలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.