ఒకప్పుడు వాళ్లు తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఏలిన నటీనటులు. తమ గ్లామర్‌తో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడందరూ తమ 50లు, 60ల దగ్గరగా ఉన్నారు. అలాంటి వాళ్లంతా ఒకచోట చేరితే. 90వ దశకంలో టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఒక ఊపు ఊపిన ఎంతోమంది నటీనటులు, దర్శకులు ఈమధ్యే గోవాలో కలిశారు.
అందరూ తెలుపు రంగు దుస్తులు ధరించి జరుపుకున్న ఈ రీ యూనియన్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో జగపతి బాబు, ప్రభుదేవా, సిమ్రన్, మీనా వంటి నటులతోపాటు, దర్శకులు శంకర్, కేఎస్ రవికుమార్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
గోవాలో 90ల్లోని ఈ స్టార్స్ తిరిగి కలిసిన ఫొటోలను ప్రముఖ నటి మీనా షేర్ చేసింది. గోవా రీ యూనియన్ ఫోటోలు చాలా వాటిని ఆమె పంచుకుంది. "జ్ఞాపకాలు సృష్టించుకున్నాం. 90ల రీ యూనియన్" అని రాశారు. ఇందులో పాల్గొన్న చాలా మంది నటీనటులు కూడా ఈ ఫొటోలను షేర్ చేసుకున్నారు. మహేశ్వరి, సంఘవి, కావ్య రమేష్, సంగీత, సిమ్రన్, శ్వేత కొన్నూర్ మీనన్, శివ రంజని, ఊహ, కేఎస్ రవికుమార్, శంకర్, లింగుసామి, మోహన్ రాజా, ప్రభుదేవా, శ్రీకాంత్, జగపతి బాబు ఈ రీ యూనియన్‌లో పాల్గొన్నారు.
సంగీత పోస్ట్ చేసిన ఒక వీడియోలో, హీరోయిన్లందరూ 'తాళ్' సినిమాలోని "కహి ఆగ్ లగే లగ్ జాయే" పాటకు డ్యాన్స్ చేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఫోటోలు, వీడియోల కింద చాలా మంది.. "ఎంతమంది స్టార్లు వచ్చినా, 90ల గోల్డెన్ గ్లోను ఏదీ భర్తీ చేయలేదు. ఈ రీ యూనియన్ ఒక మధురమైన జ్ఞాపకాల కౌగిలి", "నాకు ఇష్టమైన హీరోయిన్లందరూ ఒకే ఫ్రేమ్‌లో" వంటి కామెంట్లు చేశారు.
దక్షిణాది సినీ ప్రముఖులు ఇలా రీయూనియన్ కోసం కలవడం ఇదే మొదటిసారి కాదు. కొవిడ్ మహమ్మారికి ముందు కూడా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌లాల్, సుమలత, రాధిక, శరత్‌కుమార్ వంటి దక్షిణాది స్టార్లు అందరూ ఒకే చోట చేరి కలిసి విహారయాత్రలు, పార్టీలు చేసుకునేవారు.
ఇప్పుడు ఈ తారలు వారిని స్ఫూర్తిగా తీసుకొని తమ రీ యూనియన్‌ను నిర్వహించినట్లు అనిపిస్తోంది. వాళ్లు సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు చూస్తుంటే.. బీచ్‌లో సరదాగా గడపడం, యాట్ రైడ్‌లు చేయడం, సూర్యాస్తమయాలను ఆస్వాదించడం చేసినట్లు కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది ప్రముఖులు తమ కుటుంబాలను, పిల్లలను కూడా తీసుకొచ్చారు. అందరూ సరదాగా గోవా ట్రిప్ ఎంజాయ్ చేశారు.
సంబంధిత కథనం