Happy Birthday Kartikeya: 'ఆర్ఎక్స్ 100' హీరో నుంచి మరో సినిమా.. ఈ సారి 'డీజే టిల్లు' హీరోయిన్‌తో రొమాన్స్-tollywood hero kartikeya new movie named bedurulanka 2012 with neha shetty ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood Hero Kartikeya New Movie Named Bedurulanka 2012 With Neha Shetty

Happy Birthday Kartikeya: 'ఆర్ఎక్స్ 100' హీరో నుంచి మరో సినిమా.. ఈ సారి 'డీజే టిల్లు' హీరోయిన్‌తో రొమాన్స్

Maragani Govardhan HT Telugu
Sep 21, 2022 01:58 PM IST

Kartikeya New Movie Bedurulanka 2012: టాలీవుడ్ యువ హీరో కార్తికేయ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతడు నటిస్తున్న తాజా చిత్రం టైటిల్‌ను ఖరారు చేశారు. బెదురులంక 2012గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కార్తికేయ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది.

కార్తికేయ కొత్త సినిమా
కార్తికేయ కొత్త సినిమా (Twitter)

Kartikeya New Movie Bedurulanka 2012: ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫొటో' తీసిన నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు కాగా.. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 'బెదురులంక 2012' టైటిల్ ఖరారు చేశారు. బుధవారం (సెప్టెంబర్ 21) కార్తికేయ గుమ్మకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "మా హీరో కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన బ‌ర్త్‌డేకు టైటిల్ వెల్లడించడం సంతోషంగా ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. 'స్వర్గీయ' సిరివెన్నెల మా చిత్రంలో ఒక పాట రాశారు" అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది సినిమాలో చూడాలి" అని చెప్పారు.

కార్తికేయ, నేహా శెట్టి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్