Tollywood Report: కల్కి 2898 ఏడీ, హనుమాన్, టిల్లూ స్క్వేర్.. ఫస్ట్ హాఫ్ హిట్.. సెకండాఫ్ బ్లాక్‌బస్టర్ ఖాయమేనా?
Tollywood Report: టాలీవుడ్ ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో కల్కి 2898 ఏడీ, హనుమాన్, టిల్లూ స్క్వేర్ లాంటి సినిమాలతో హిట్ అయింది. ఇక సెకండాఫ్ లో దేవర, పుష్ప 2, ఓజీ, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలు రానుండటంతో బ్లాక్ బస్టర్ ఖాయంగా కనిపిస్తోంది.
Tollywood Report: టాలీవుడ్ 2024లో మొదటి ఆరు నెలల్లో కొన్ని సూపర్ హిట్ మూవీస్ అందించింది. అందులో రెండు పాన్ ఇండియా సినిమాలు దుమ్ము రేపాయి. సంక్రాంతికి వచ్చిన హనుమాన్, మార్చి చివర్లో వచ్చిన టిల్లూ స్క్వేర్, ఈ మధ్యే వచ్చిన కల్కి 2898 ఏడీలాంటి సినిమాలు ఈ ఏడాది అతిపెద్ద హిట్స్ గా నిలవగా.. సెకండాఫ్ లో పుష్ప 2, దేవర, ఓజీ, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలు రానున్నాయి.
టాలీవుడ్.. సూపర్ హిట్..
సుమారు పదేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవల్లో సినిమాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లోనూ అలాంటి రెండు సినిమాలు వచ్చాయి. సంక్రాంతి సమయంలో వచ్చిన హనుమాన్ ఊహించిన స్థాయిలో పాన్ ఇండియా లెవల్లో హిట్ సాధించింది. ఇక ఆలస్యంగా వచ్చినా.. ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది.
అయితే అదే సమయంలో దారుణమైన ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజైన గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, ఈగల్, ఆపరేషన్ వాలెంటైన్, సైంధవ్, మనమే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలాంటి సినిమాలు బోల్తా కొట్టాయి. ఇక చిన్న సినిమాలైన ఆ ఒక్కటి అడక్కు, చారి 111, సుందరం మాస్టర్, గీతాంజలి మళ్లీ వచ్చింది, సత్యభామ, హరోం హర, గం గం గణేశా, భజే వాయు వేగం, ప్రతినిధి 2, లవ్ మిలాంటి సినిమాలు కూడా నిరాశ పరిచాయి.
హనుమాన్, కల్కి 2898 ఏడీ బ్లాక్‌బస్టర్
ఈ ఏడాది టాలీవుడ్ కు అతిపెద్ద సర్‌ప్రైజ్ హనుమాన్ మూవీయే. తేజ సజ్జ నటించిన ఈ సినిమా కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. సంక్రాంతి సమయంలో రిలీజైన గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్ లాంటి పెద్ద హీరోల సినిమాలను వెనక్కి నెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన టిల్లూ స్క్వేర్ కూడా సూపర్ హిట్ అయింది.
పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మార్చి 29న రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.125.75 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ మధ్య రిలీజైన కల్కి 2898 ఏడీ రికార్డుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏడు రోజుల్లోనే రూ.700 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. జులై 12న ఇండియన్ 2 మూవీ ఉండటంతో అంత వరకైతే కల్కి వసూళ్ల పర్వం కొనసాగే అవకాశం ఉంది.
సెకండాఫ్ బ్లాక్‌బస్టర్లే..
ఫస్ట్ హాఫ్ హిట్ కాగా.. సెకండాఫ్ బ్లాక్ బస్టర్ ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే అసలు సినిమాలన్నీ ఈ ఆరు నెలల్లోనే రాబోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అల్లు అర్జున్ పుష్ప 2.. పవన్ కల్యాణ్ ఓజీ.. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలు రాబోతున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సినిమాలు కావడంతో ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించనున్నాయి.
పుష్ప 2 ఆగస్ట్ 15నే రావాల్సి ఉన్నా.. డిసెంబర్ కు వాయిదా పడింది. ఆ రోజు రామ్, పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ రానుంది. ఈ సినిమాపైనా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 27న దేవర రాబోతోంది. ఓజీ, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ డేట్లు ఇంకా తెలియాల్సి ఉంది.
టాపిక్