Tollywood Family Multistarrers :మామా అల్లుడు - బాబాయ్ అబ్బాయ్ - ఫ్యామిలీ మల్టీస్టారర్స్ వచ్చేస్తున్నాయి
Tollywood Family Multistarrers: గతంతో పోలిస్తే టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ పెరిగింది. ఇతర హీరోలతో పాటు ఒకే ఫ్యామిలీకి చెందిన కథానాయకులు కలిసి సినిమాలు చేస్తోన్నారు. ఈ స్పెషల్ కాంబినేషన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి.
Tollywood Family Multistarrers: ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు సింగిల్ ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది ఒకే ఫ్యామిలీకి చెందిన తమ అభిమాన హీరోలను కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటుంటారు.కానీ ఈ ఫ్యామిలీ మల్టీస్టారర్స్ అరుదుగా సెట్ అవుతుంటాయి. అలాంటి కాంబినేషన్స్‌తో ప్రస్తుతం టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు రూపొందుతోన్నాయి. ఆ సినిమాలు ఏవంటే....
మామయ్య దేవుడు - అల్లుడు భక్తుడు
మెగా మామా అల్లుళ్లు పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ తొలిసారి కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అన్నయ్య చిరంజీవి మినహా మెగా హీరోలతో కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు పవన్ కళ్యాణ్. తొలిసారి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి పవర్ స్టార్ సినిమా చేయబోతుండటం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తమిళంలో విజయవంతమైన వినోధయ సీతమ్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా మొదలైంది.
ఫాంటసీ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తోన్నాడు. ప్రమాదంలో కన్నుమూసిన ఓ వ్యక్తికి దేవుడు 90 రోజులు మరలా బతికే ఛాన్స్ ఇస్తే ఏం జరిగిందనే పాయింట్‌తో ఈ రీమేక్ తెరకెక్కుతోంది.
బాబాయ్ అబ్బాయ్ వెబ్ సిరీస్
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా తొలిసారి కలిసి రానా నాయుడు వెబ్‌సిరీస్‌లో నటిస్తోన్నారు. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా కనపించబోతున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీలకు వచ్చే సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా రానా కనిపిస్తోండగా అతడి తండ్రిగా నాగగా పవర్‌ఫుల్ రోల్‌లో వెంకటేష్ నటిస్తున్నాడు. హాలీవుడ్ సిరీస్ రే డోనోవన్ కు ఇండియన్ అడాప్షన్‌గా తెరకెక్కుతోన్న రానా నాయుడు సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సూపర్న్ వర్న దర్శకత్వం వహిస్తోన్నారు.
నాగ్ 100వ సినిమాలో అఖిల్
అక్కినేని హీరోలు కలిసి నటించిన మనం సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించాడు అఖిల్. తొలిసారి తండ్రితో కలిసి ఫుల్‌లెంగ్త్ సినిమా చేసేందుకు రెడీ అవుతోన్నాడు. నాగార్జున 100వ ప్రాజెక్ట్‌గా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున, అఖిల్ హీరోలుగా నటించబోతున్నారు.
అఖిల్‌తో సినిమా చేయనున్న విషయాన్ని ది ఘోస్ట్ ప్రమోషన్స్‌లో నాగార్జున రివీల్ చేశాడు. ఈ సినిమాకు గాడ్‌ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
తండ్రీకూతుళ్ల కలయికలో...
తనయులు విష్ణు, మనోజ్‌లతో కలిసి పలు సినిమాలు చేశాడు మోహన్‌బాబు. కానీ కూతురు లక్ష్మి ప్రసన్నతో మాత్రం ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఈ తండ్రీకూతుళ్ల కాంబో అగ్ని నక్షత్రం సినిమాతో కార్యరూపం దాల్చనుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు వంశీకృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తోన్నాడు.