The Goat Life Movie: మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ‘ది గోట్ లైఫ్ - ఆడుజీవితం’ సినిమా విడుదలకు రెడీ అయింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. మలయాళం పాటు తెలుగులోనూ ‘ది గోట్ లైఫ్’ విడుదల కానుంది. సలార్ మూవీతో పృథ్విరాజ్‍కు తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. కాగా, తెలుగు దర్శకుల కోసం ‘ది గోట్ లైఫ్’ సినిమా ప్రత్యేక ప్రీమియర్‌ను మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. టాలీవుడ్ దర్శకులు ఈ చిత్రాన్ని చూసి.. ప్రశంసలు కురిపించారు.
‘ది గోట్ లైఫ్ - ఆడుజీవితం’ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ తరుణంలో టాలీవుడ్ దర్శకుల కోసం ప్రత్యేక ప్రీమియర్ ఏర్పాటు చేసింది. హీరో పృథ్విరాజ్ కూడా ఈ షోకు హాజరయ్యారు. హను రాఘవపూడి, శివ నిర్వాణ, అజయ్ భూపతి, శ్రీను వైట్ల, వెంకీ అట్లూరితో పాటు మరికొందరు టాలీవుడ్ దర్శకులు, సెలెబ్రిటీలు ఈ ప్రీమియర్‌లో ది గోట్ లైఫ్ సినిమా చూశారు.
ది గోట్ లైఫ్ చిత్రంపై దర్శకుడు అజయ్ భూపతి ప్రశంసలు కురిపించారు. ఇటీవలి కాలంలో తాను చూసిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ఇదేనని అన్నారు. పృథ్విరాజ్ పర్ఫార్మెన్స్ గూజ్‍బంప్స్ తెప్పించిందని చెప్పారు. ఈ చిత్రాన్ని చూసి తాను షాకయ్యానని చెప్పారు.
ది గోట్ లైఫ్ చిత్రానికి జాతీయ అవార్డు సాధించే అన్ని అర్హతలు ఉన్నాయని దర్శకుడు శివ నిర్వాణ చెప్పారు. ఎంతో అద్భుతంగా ఈ క్లాసిక్ మూవీని తెరకెక్కించారని అన్నారు. ఈ చిత్రం కోసం మూవీ టీమ్ పడిన కష్టానికి హ్యాట్సాఫ్ అని శ్రీను వైట్ల అన్నారు. చాలా గొప్పగా ఉందని అన్నారు.
పదేళ్లు కష్టపడి ఇలాంటి చిత్రం చేయడం మామూలు విషయం కాదని డైరెక్టర్ హను రాఘవపూడి చెప్పారు. పృథ్విరాజ్ సహా మూవీ టీమ్‍కు హ్యాట్సాఫ్ చెప్పారు. ఇక ప్రీమియర్‌కు హాజరైన మిగిలిన దర్శకులు కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు.
ది గోట్ లైఫ్ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. బెన్యూమిన్ రచించిన ఆడు జీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ బానిసగా మారి.. సవాళ్లను ఎదుర్కొన్న నజీబ్ అనే వ్యక్తి నిజజీవితం ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నజీబ్‍గా ఈ మూవీలో పృథ్విరాజ్ నటించారు. ట్రైలర్‌లో ఆయన నటన, మేకోవర్ అద్భుతంగా అనిపించాయి. ఎడారిలోనే ఈ మూవీ ఎక్కువగా సాగుతుంది. ట్రైలర్ అదిరిపోవడంతో ఈ చిత్రంపై హైప్ చాలా పెరిగింది. ఈ చిత్రంలో అమలాపాల్ కీలకపాత్ర పోషించారు.
ది గోట్ లైఫ్ చిత్రం కోసమే 10 ఏళ్లకుపైగా పని చేశారు దర్శకుడు బ్లెస్సీ. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ట్రైలర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా సాగగా.. ఇప్పటి వరకు వచ్చిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. విజువల్స్ కూడా ఈ చిత్రం అదిరిపోనున్నాయని ట్రైలర్‌తో తెలిసిపోయింది. ఈ చిత్రాన్ని బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ నిర్మించారు.
ది గోట్ లైఫ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ దక్కనుంది. పాజిటివ్ టాక్ వస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయ్యే అవకాశం ఉంది. సలార్ మూవీతో తెలుగులోనూ పృథ్విరాజ్ పాపులర్ అవడంతో ఇక్కడ కూడా మంచి కలెక్షన్లు వస్తాయని అంచనాలు ఉన్నాయి.