Tollywood: సీఏంతో భేటీకి హాజరైన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే - చిరంజీవి మిస్ - కనిపించని స్టార్స్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరుగుతోన్న ఈ భేటీకి చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్ సహా పలువురు స్టార్ హీరోలు రాలేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేడు(గురువారం) సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరుగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పాటు అల్లు అర్జున్ అరెస్ట్...ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మీటింగ్ ఆసక్తికరంగా మారింది.
చిరంజీవితో పాటు స్టార్ హీరోలు...
సీఏంతో భేటీలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తోపాటు అగ్ర హీరోలందరూ ఈ మీటింగ్‌కు హాజరుకాకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన దిల్‌రాజుతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, నాగవంశీ, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్‌తో పాటు హీరోలు నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, సాయిధరమ్‌తేజ్, కళ్యాణ్ రామ్‌తో పాటు దాదాపు 50 మంది వరకు సినీ ప్రముఖులు ఈ మీటింగ్‌కు హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది.
పోలీసుల అనుమతి లేకుండా...
సంధ్య థియేటర్ వివాదం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. పోలీసులు అనుమతి నిరాకరించిన అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చాడని, అతడు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని అసెంబ్లీలో సీఏం స్వయంగా ప్రకటించారు.
పోలీసులు వెళ్లిపొమ్మని చెప్పేవరకు అల్లు అర్జున్ థియేటర్‌లోనే ఉన్నాడని అన్నారు. అల్లు అర్జున్‌తో పాటు అతడి ఫ్యామిలీ మెంబర్స్ థియేటర్‌కు వచ్చినప్పటి నుంచి వెళ్లిపోయే వరకు ఏం జరిగిందన్నది సీసీటీవీ వీడియో ఫుటేజ్ బయటపెట్టారు.
అల్లు అర్జున్ మాత్రం తనపై వస్తోన్నవన్నీ నిరాధారమైన ఆరోపణలు అంటూ పేర్కొన్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఇకపై టాలీవుడ్‌కు ఎలాంటి రాయితీలు ఇవ్వమని, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడం కుదరదని సీఏం అసెంబ్లీలో ప్రకటించారు.
వివాదం...
సంధ్య థియేటర్ వివాదం, అల్లు అర్జున్ అరెస్ట్‌తో పాటు పలు అంశాల సంబంధించి సినీ ప్రముఖులతో సీఏం చర్చలు జరపబోతున్నట్లు తెలిసింది.బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల గురించి మీటింగ్‌లో మాట్లాడుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని అసెంబ్లీలో ప్రకటించిన మాటకే సీఏం కట్టుబడి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై సినీ ప్రముఖులకు పోలీస్ అధికారులు పలు సూచనలు చేయబోతున్నట్లు తెలిసింది. చిన్న థియేటర్ సమస్యలు, సినిమా అవార్డులతో పాటు అనేక అంశాల గురించి ఈ మీటింగ్‌లో చర్చించుకోబోతున్నట్లు సమాచారం.