Poonam Kaur on Trivikram: త్రివిక్రమ్‍ను ప్రశ్నించాలి: హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
Poonam Kaur on Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‍పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేశారు. ఆయనను టాలీవుడ్ పెద్దలు ప్రశ్నించాలంటూ ఓ పోస్ట్ చేశారు. ఆయనపై గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వెల్లడించారు.
హీరోయిన్ పూనమ్ కౌర్ తెలుగులో దాదాపు ఓ 20 సినిమాల వరకు చేశారు. దీంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే, కొంతకాలంగా ఈమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా వారి మద్దతుదారులపై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. పరోక్షంగా ఇలా చాలా సార్లు సోషల్ మీడియాలో రాతలు రాశారు. వారికి వ్యతిరేకంగా ఎందుకు ఉన్నారనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే, నేడు (సెప్టెంబర్ 17) త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నేరుగా ఓ సంచలన ట్వీట్ చేశారు పూనమ్.
త్రివిక్రమ్‍పై ఫిర్యాదు చేశా.. కానీ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు త్రివిక్రమ్ శ్రీనివాస్‍పై తాను గతంలోనే ఫిర్యాదు చేశానంటూ నేడు వెల్లడించారు పూనమ్ కౌర్. ఒకవేళ వారు ఆ ఫిర్యాదును సీరియస్‍గా తీసుకొని ఉంటే తనకు రాజకీయ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని రాసుకొచ్చారు. “త్రివిక్రమ్ శ్రీనివాస్‍పై ఇచ్చిన కంప్లైట్‍ను మా అసోసియేషన్ తీసుకొని ఉంటే.. నాతో పాటు చాలా మందికి రాజకీయంగా వేధన ఉండేది కాదు. నన్ను సైలెంట్‍గా విస్మరించారు” అని పూనమ్ కౌర్ రాసుకొచ్చారు.
త్రివిక్రమ్‍ను ప్రశ్నించాలి
టాలీవుడ్ పెద్దలకు తాను ఫిర్యాదు చేశానని పూనమ్ కౌర్ అదే ట్వీట్‍లో పేర్కొన్నారు. ఇండస్ట్రీలోని పెద్దలు త్రివిక్రమ్‍ను ప్రశ్నించాలని తాను కోరుతున్నానని అన్నారు.
ఏ విషయంలో?
అయితే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‍పై ఏ విషయంలో తాను కంప్లైట్ ఇచ్చారో పూనమ్ కౌర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పొలిటకల్ సఫరింగ్ అంటూ ఏదో రాసుకొచ్చారు. అయితే, ఏ అంశానికి సంబంధించిందనే విషయం ఏ మాత్రం కూడా హింట్ ఇవ్వలేదు. కేవలం త్రివిక్రమ్‍ను విచారించాలంటూ రాసుకొచ్చారు.
జానీని మాస్టర్ అనొద్దు!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను లైంగికంగా జానీ విధించారని ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ మహిళా కొరియోగ్రాఫర్. ఈ విషయంపై నేటి ఉదయమే పూనమ్ కౌర్ స్పందించారు. షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దని పూనమ్ ట్వీట్ చేశారు. మాస్టర్ అనే పదానికి గౌరవం ఉందని, జానీ అలా అనొద్దని ఆమె రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జానీపై ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పోస్ట్ చేశారు పూనమ్ కౌర్. అయితే, త్రివిక్రమ్ గురించి ఎందుకు ట్వీట్ చేశారో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.