Tiger 3 box office collection Day 2: చరిత్ర సృష్టించిన టైగర్ 3.. రెండో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎన్నంటే?
Tiger 3 box office collection Day 2: టైగర్ 3 మూవీ చరిత్ర సృష్టించింది. దీపావళినాడు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. అంతేకాదు రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరగడం విశేషం.
Tiger 3 box office collection Day 2: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 మూవీ దీపావళి రోజు రిలీజై రికార్డు క్రియేట్ చేసింది. దివాలీ నాడు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. ఆదివారం (నవంబర్ 12) రిలీజైన ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ఇండియాలో టైగర్ 3 గ్రాస్ కలెక్షన్లు రూ.52.5 కోట్ల గ్రాస్.. రూ.44.5 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇక విదేశాల్లో రూ.41.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో మొత్తంగా తొలి రోజు రూ.94 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. రెండో రోజు ఈ కలెక్షన్లు మరింత పెరిగాయి. ఇండియాలోనే టైగర్ 3 మూవీ రూ.54.67 కోట్లు వసూలు చేయడం విశేషం.
ఈ క్రమంలో షారుక్ ఖాన్ జవాన్ మూవీని కూడా టైగర్ 3 వెనక్కి నెట్టింది. జవాన్ మూవీ రెండో రోజు కలెక్షన్లు రూ.53 కోట్లుగా ఉన్నాయి. అయితే పఠాన్ రికార్డుకు మాత్రం చాలా దూరంలోనే ఆగిపోయింది. పఠాన్ మూవీ రెండో రోజు కూడా ఏకంగా రూ.70 కోట్లు వసూలు చేసింది. రిపబ్లిక్ డే హాలిడే కావడం, తొలి రోజు పాజిటివ్ రివ్యూలతో పఠాన్ కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక టైగర్ 3 విషయానికి వస్తే.. రెండు రోజుల్లోనే ఇండియాలో గ్రాస్ కలెక్షన్లు రూ.100 కోట్లు దాటాయి. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు కూడా రావడంతో వచ్చే వీకెండ్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై తర్వాత వచ్చిన సినిమా టైగర్ 3.
యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆ రెండు సినిమాలతోపాటు వార్, పఠాన్ లకు ఇప్పుడీ టైగర్ 3 తోడైంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో బెస్ట్ మూవీ టైగర్ 3 అని తొలి రోజే అభిమానులు తేల్చేశారు. ఈ సినిమాలో పఠాన్, వార్ హీరోలు షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ లో కనిపించడం విశేషం.