Tiger 3 Box Office Collections: దుమ్ము రేపిన టైగర్ 3 బాక్సాఫీస్ కలెక్షన్లు.. తొలి రోజు ఎంతంటే?
Tiger 3 Box Office Collections: టైగర్ 3 బాక్సాఫీస్ కలెక్షన్లు దుమ్ము రేపాయి. దీపావళి సందర్భంగా ఆదివారం (నవంబర్ 12) రిలీజైన ఈ సల్మాన్ ఖాన్ సినిమా.. తొలి రోజే భారీగా వసూళ్లు సాధించింది.
Tiger 3 Box Office Collections: టైగర్ 3 మూవీ ఊహించినట్లే తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. దీపావళి (నవంబర్ 12) నాడు రిలీజ్ అయిన ఈ సల్మాన్ ఖాన్ మూవీ.. తొలి రోజు ఏకంగా రూ.44.5 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ కలెక్షన్ల పరంపర ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టైగర్ 3 మూవీ బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన దీపావళి సినిమాగా నిలిచింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చింది. మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన బెస్ట్ మూవీగా నిలుస్తుందని తొలి రోజే ఫ్యాన్స్ తేల్చేశారు.
తొలి రోజు ఇండియా కలెక్షన్లు ఇవీ..
టైగర్ 3 మూవీ దీపావళి రోజు రిలీజ్ కానున్నట్లు తేలడంతో చాలా రోజు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా సాగాయి. ఆ లెక్కన తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే ఉంటాయని ట్రేడ్ అనలిస్టులు ఓ అంచనాకు వచ్చారు. ఊహించినట్లే తొలి రోజు ఈ సినిమా ఇండియాలోనే అన్ని భాషల్లో కలిపి రూ.44.5 కోట్లు వసూలు చేసింది.
ఇండియాలోనే టైగర్ 3 మూవీ 5500 స్క్రీన్లలో రిలీజైంది. ఇక విదేశాల్లో 3400 స్క్రీన్లలో వచ్చింది. అయితే హిందీలో ఈ సినిమా ఆక్యుపెన్సీ రేషియో మాత్రం కేవలం 41 శాతంగానే ఉంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై మూవీలకు త్రీక్వెల్ గా ఈ టైగర్ 3 వచ్చింది. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ విషయానికి వస్తే అందులో ఆ రెండు సినిమాలతోపాటు వార్, పఠాన్ కూడా ఉన్నాయి.
అవినాష్, జోయా పాత్రల్లో సల్మాన్, కత్రినా ఇందులో నటించారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ కూడా అతిథి పాత్రల్లో కనిపించడం విశేషం. ప్రీతమ్ మ్యూజిక్ అందించాడు. టైగర్ 3 మూవీని రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు తెలిసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ లో అతి భారీ ప్రాజెక్ట్ ఇదే. మరి వసూళ్లలోనూ దూసుకెళ్లి.. సినిమాకు లాభాలు వస్తాయా లేదా చూడాలి.