Ticket Prices Hike for Sankranthi Movies: ఏపీలో సంక్రాంతి సినిమాలకు పెరిగిన టికెట్ల ధరలు.. ఎంతంటే?
Ticket Prices Hike for Sankranthi Movies: ఏపీలో సంక్రాంతి సినిమాలకు టికెట్ల ధరలు పెరిగాయి. ఈసారి పెద్ద హీరోలు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఉండటంతో ప్రొడ్యూసర్ల వినతి మేరకు ధరలు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అయితే తెలుగు ప్రేక్షకులకు అసలైన పండగ మాత్రం గురువారం (జనవరి 12) నుంచే ప్రారంభం కానుంది. ఎందుకంటే గురువారం బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి, శుక్రవారం (జనవరి 13) చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. తాజాగా ఈ రెండు పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అయితే రెండు సినిమాలకు ఒకే ధర కాకుండా.. వేర్వేరుగా నిర్ణయించడం విశేషం. చిరంజీవి సినిమా వాల్తేర్ వీరయ్యకు టికెట్ ధరపై రూ.25 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. తొలి పది రోజులు ఈ పెరిగిన టికెట్ల ధరలు అమల్లో ఉంటాయి. ఈ రూ.25 పెంపు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లకు వర్తించనుంది. ఇక బాలయ్య నటించిన వీర సింహా రెడ్డికి మాత్రం రూ.20 పెంచుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది.
ఈ సినిమాకు కూడా పెరిగిన టికెట్ల ధరలు తొలి పది రోజులు అమల్లో ఉంటాయి. అయితే ఈ రెండు సినిమాలకు తెలంగాణతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువ మేరే టికెట్ల ధరల పెంపు ఉంది. హైదరాబాద్‌లో ఈ సినిమాలకు మల్టీప్లెక్స్‌లలో అయితే రూ.295, సింగిల్ స్క్రీన్లలో అయితే రూ.175గా టికెట్ల ధరలు ఉన్నాయి. ఏపీలో టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఏడాది కిందట జీవో జారీ చేసింది.
ఇలా పెద్ద సినిమాలు రిలీజైనప్పుడు మాత్రం నిర్మాతల విన్నపాల మేరకు కాస్త పెంచుకోవడానికి అనుమతి ఇస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఇది చాలా తక్కువే అయినా.. ఎంతో కొంత ఎక్కువ వచ్చినా చాలని ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు.
సంబంధిత కథనం