Thundu Movie Review: తుండు రివ్యూ - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన లేటెస్ట్ మలయాళం కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Thundu Movie Review: బిజు మీనన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించిన తుండు మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కామెడీ మూవీకి రియాస్ షరీష్ దర్శకుడు.
Thundu Movie Review: బిజు మీనన్ (Biju Menon) హీరోగా నటించిన మలయాళ మూవీ తుండు ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) రిలీజైంది. కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు రియాస్ షరీష్ దర్శకత్వం వహించాడు. తెలుగు ఆడియోతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందంటే?
కానిస్టేబుల్ కష్టాలు...
బేబీ (బిజుమీనన్) ఓ పోలీస్ కానిస్టేబుల్. అతడు పనిచేసే పోలీస్ స్టేషన్‌లో శిబిన్ (షైన్ టామ్ చాకో) కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. బేబీ కంటే శిబిన్ జూనియర్. కానీ డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌లు రాసి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ కొట్టేస్తాడు. బేబీ, శిబిన్ మధ్య ఈగో ఇష్యూస్ ఉంటాయి. శిబిన్ కజిన్ గిరీష్‌ను ఓ చిన్న కేసులో బేబీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతాడు. అతడిని విడిచిపించడానికి వచ్చిన శిబిన్‌ను బేబీ అవమానిస్తాడు.
ఆ సంఘటనతో బేబీపై పగను పెంచుకుంటాడు శిబిన్. బేబీని ఓ యాక్సిడెంట్ కేసులో ఇరికిస్తాడు. హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందడానికి బేబీ డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధమవుతాడు. బేబీ ఎగ్జామ్స్‌లో స్లిప్‌లు పెట్టబోతున్నాడని ముందే ఊహించిన శిబిన్ ఆ సమాచారాన్ని మీడియాకు ఇస్తాడు. డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌లో కాపీ కొడుతూ కమీషనర్‌కు పట్టుపడతాడు బేబీ.
ఆ న్యూస్ మీడియాలో హైలైట్ కావడంతో బేబీని పనిష్‌మెంట్‌గా కొన్నాళ్లు పోలీస్ ట్రైనింగ్ అకాడెమీకి పంపిస్తారు. ఆ ట్రైనింగ్‌లోనూ బేబీకి అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతాయి. ఆ అడ్డంకులను బేబీ ఎలా అధిగమించాడు? ప్రమోషన్స్ కోసం మరోసారి స్లిప్‌లు పెట్టి ఎగ్జామ్స్ రాసిన బేబీ డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌లో పాసయ్యాడా? శిబిన్‌తో పాటు గిరీష్‌లపై బేబీ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నదే ఈ మూవీ కథ.
ఈగో కాన్సెప్ట్...
ఈగో ఇష్యూస్ కాన్సెప్ట్‌తో మలయాళం భాషలోవచ్చిన డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలు కమర్షియల్‌గా పెద్ద విజయాల్ని సాధించాయి. ఈ సినిమాల్లో ఈగో వల్ల తలత్తే పరిణామాలను సీరియస్‌గా చూపించారు ఆయా సినిమాల డైరెక్టర్లు.
వాటికి భిన్నంగా తుండు సినిమాను దర్శకుడు రియాస్ షరీష్ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. ఈగో కారణంగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ మధ్య ఏర్పడిన వైరం ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే పాయింట్ తో ప్రారంభం నుంచి చివరి వరకుఆడియెన్స్‌ను నవ్వించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు.
బేబీకి ఎదురయ్యే అడ్డంకులను వినోదాత్మకంగా రాసుకున్నాడు డైరెక్టర్. బేబీ చేసే పనులన్నీ రివర్స్ అయ్యి అతడి ఉద్యోగానికే ఎసరు పడటం ఫన్నీగా అనిపిస్తుంది. బిర్యానీ సెంటర్‌లో గొడవను ఆపడానికి వెళ్లిన పోలీసులను అక్కడి ప్రజలే కాపాడటం, కుక్క ఎపిసోడ్‌తో పాటు కొన్ని సీన్స్‌లోని కామెడీ వర్కవుట్ అయ్యింది.
డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌లో స్లిప్పులు పెట్టడం అనే మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ ను మాత్రం ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయాడు డైరెక్టర్. ఆ పాయింట్ కన్వీన్సింగ్‌గా అనిపించదు. బేబీతో పాటు అతడి కొడుకు ఎగ్జామ్స్‌లో స్లిప్స్ పెట్టే సీన్స్ చాలా వరకు కొరియన్ భాషలో వచ్చిన బ్యాడ్ జీనియస్ అనే సినిమాను గుర్తుకుతెస్తాయి.
క్లైమాక్స్‌లో ట్విస్ట్...
బేబీ, శిబిన్‌ల మధ్య ఈగోకు కారణమైన పరిస్థితుల్లో డెప్త్ మిస్సయింది. చివరకు శిబిన్‌పై బేబీ ఎలా విజయం సాధించాడు? ఏఎస్ఐగా ప్రమోషన్ ఏ విధంగా వచ్చిందన్నది చిన్న ట్విస్ట్‌తో చూపించారు. అదొక్కటి పర్వాలేదనిపిస్తుంది. రివేంజ్ అంశాలతో పాటు ఓ ఫ్యామిలీ డ్రామాను సమానంగా చూపిస్తూ కథను ముందుకు నడిపించారు. కానీ ఈ ఫ్యామిలీ సీన్స్ లో ఎమోషన్, సెంటిమెంట్ పాళ్లు తగ్గాయి.
బేబీ పాత్రకు న్యాయం...
బేబీ పాత్రలో బిజు మీనన్ పూర్తిగా న్యాయం చేశాడు. తన ప్రమేయం లేకుండానే ఇబ్బందుల్లో పడే కానిస్టేబుల్‌గా సెటిల్డ్ యాక్టింగ్‌తో కామెడీని పండించాడు. బేబీపై రివేంజ్ తీర్చుకునే పాత్రలో షైన్ టామ్ చాకో విలనిజం సరిగ్గా వర్కవుట్ కాలేదు. క్యారెక్టర్ పైపైనే రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. బేబీతో పనిచేసే కానిస్టేబుల్స్‌లో గోకులన్ క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కామెడీ ట్రాక్స్ నవ్విస్తాయి.
పేరుకే కామెడీ మూవీ...
తుండు పేరుకు కామెడీ సినిమానే అయినా నవ్వుల డోస్ మాత్రం తక్కువేనని చెప్పవచ్చు. బిజు బీనన్ యాక్టింగ్ కోసం మూవీ చూడొచ్చు.