37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబో రిపీట్ కావడం.. త్రిష, సిలంబరసన్ లాంటి వాళ్లు నటించడం.. యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ రావడం.. ఇలా థగ్ లైఫ్ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తీరా సినిమా థియేటర్లకు వచ్చాక మాత్రం ఊహించని ఫలితం కనిపిస్తోంది. కన్నడ భాష వివాదంతో కర్ణాటకలో రిలీజ్ కాలేకపోయిన థగ్ లైఫ్ కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీలోకి ముందుగానే వస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
థగ్ లైఫ్ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.149.7 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను విజయ్ టీవీ రూ.60 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో థగ్ లైఫ్ థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా రూ.210 కోట్లు వచ్చాయి.
థగ్ లైఫ్ థియేటర్లలో రిలీజ్ కాకముందే ఓటీటీ డేట్ కూడా నెట్‌ఫ్లిక్స్ ఖరారు చేసింది. సాధారణంగా అయితే ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. స్టార్ హీరోల సినిమాలు, బ్లాక్ బస్టర్ మూవీస్ కొన్నిసార్లు ఆలస్యంగా ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ థగ్ లైఫ్ మూవీని థియేట్రికల్ రిలీజ్ అయిన 8వ వారం తర్వాత ఓటీటీలోకి తీసుకొస్తామని నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అంటే ఆగస్టు 7న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.
నిజానికి సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా థగ్ లైఫ్ ఓటీటీ రిలీజ్ పై నెట్‌ఫ్లిక్స్ ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చింది. కానీ ఇప్పుడు మూవీ కలెక్షన్లు గొప్పగా ఏం లేదు. ఈ సినిమా హిట్ గా నిలవడం కష్టమే. ఈ నేపథ్యంలో 8 వారాల తర్వాత కాకుండా ముందుగానే థగ్ లైఫ్ ను ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంటే జూన్ ఫస్ట్ వీక్ లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మరి నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొదట అనుకున్నట్లు 8వ వారం తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తుందా? లేదా ముందుగానే ఓటీటీలోకి తీసుకువస్తుందా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
సంబంధిత కథనం