కమల్‌హాసన్, శింబు హీరోలుగా నటించిన థగ్‌లైఫ్ మూవీ ట్రైలర్ శనివారం రిలీజైంది. తండ్రీకొడుకుల అనుబంధానికి యాక్షన్ అంశాలు జోడించి ఇంటెన్స్‌గా డైరెక్టర్ మణిరత్నం ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. మంచు పర్వతాలను చూపిస్తూ ఇంట్రెస్టింగ్‌గా ఈ ట్రైలర్ ప్రారంభమైంది.
తనపై ఎటాక్ చేయడానికి వచ్చిన రౌడీలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ కమల్ డిఫరెంట్ లుక్‌లలో ఈ ట్రైలర్‌లో కనిపించారు. నువ్వు నా ప్రాణం కాపాడినోడివి...యముడికి దొరక్కుండా వెనక్కి లాగినోడివి.. అంటూ కమల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఛేజింగ్ సీన్‌తో స్టైలిష్‌గా శింబు ట్రైలర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అమర్ పాత్రలో అతడు కనిపించాడు. ట్రైలర్‌లో యాక్షన్ అంశాలనే ఎక్కువగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్‌లు థ్రిల్లింగ్‌ను పంచుతున్నాయి. ఇది యముడికి నాకు జరిగే కథ...నువ్వు...నేనా గెలిచేది అని ట్రైలర్ చివరలో కమల్ హాసన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఆరంభంలో తండ్రీకొడుకులుగా కనిపించిన కమల్‌హాసన్, శింబులను ట్రైలర్ చివరలో శత్రువులుగా చూపించి థగ్‌లైఫ్‌పై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు మణిరత్నం.
థగ్ లైఫ్ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో లీకైన కథ...ట్రైలర్‌లో చూపించిన స్టోరీ ఇంచుమించు ఒకేలా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫేమస్ గ్యాంగ్‌స్టర్ అయిన కమల్‌హాసన్‌కు ఓ పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో అతడు చనిపోయాడని అతడి కొడుకుతో పాటు మిగిలిన వాళ్లు అనుకుంటారు.
కమల్‌హాసన్ కొడుకు గ్యాంగ్‌స్టర్ వరల్డ్‌లో తిరుగులేని లీడర్ అవుతాడు. తండ్రినే మించిపోతాడు. ఇలాంటి టైమ్‌లోనే చనిపోయాడనుకున్న కమల్‌హాసన్ తిరిగిరావడం...కొడుకు అతడికి చేసిన ద్రోహం బయటపడటం...ఆ తర్వాత కొడుకుపై తండ్రి సాగించిన యుద్ధం నేపథ్యంలో థగ్ లైఫ్ మూవీ సాగుతుందంటూ ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ కూడా లీక్ అయినా స్టోరీకి దగ్గరగా ఉండటంతో థగ్ లైఫ్ కథ ఇదేకావచ్చునంటూ నెటిజన్లు చెబుతోన్నారు.
థగ్ లైఫ్ మూవీకి దర్శకత్వం వహిస్తూ కమల్‌హాసన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు మణిరత్నం.
త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో జోజుజార్జ్, గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయకుడు బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు 36 ఏళ్ల గ్యాప్ తర్వాత కమల్‌హాసన్, మణిరత్నం కాంబోలో ఈ మూవీ రాబోతోంది. జూన్ 5న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
సంబంధిత కథనం