కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య రిలీజైన థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది. అది కూడా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా బుధవారం (జులై 2) అర్ధరాత్రి దాటగానే స్ట్రీమింగ్ మొదలైంది.
థగ్ లైఫ్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఒరిజినల్ అయిన తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“ఇది రంగరాయ శక్తివేల్, యముడి మధ్య పోటీ. థగ్ లైఫ్ మూవీని ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లో చూడండి” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. నిజానికి శుక్రవారం (జులై 4) నుంచి ఈ సినిమా స్ట్రీమింత్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఒక రోజు ముందే రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో నిర్మాతలు చాలా రకాలుగా నష్టపోయారు. కలెక్షన్లు అసలు బ్రేక్ ఈవెన్ కు దరిదాపుల్లో కూడా లేవు. అంతేకాకుండా ఒప్పందానికి విరుద్ధంగా ముందుగానే ఓటీటీలోకి తీసుకువస్తున్నందుకు నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
ఇవన్నీ కాకుండా నెట్‌ఫ్లిక్స్ మేకర్స్ తో అంతకుముందు కుదుర్చుకున్న డీల్ ను భారీగా తగ్గించేసింది. మూవీ రిలీజ్ కు ముందు ఏకంగా రూ.135 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కానీ సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడం, బాక్సాఫీస్ ఫెయిల్యూర్ తో దానిని రూ.110 కోట్లకు తగ్గించేసింది.
నిజానికి రూ.90 కోట్లే చెల్లిస్తామని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసినా.. మేకర్స్ దానిని రూ.110 కోట్లకు పెంచగలిగారు. థియేటర్లలో డిజాస్టర్ అయిన థగ్ లైఫ్ సినిమాకు నెట్‌ఫ్లిక్స్ లో ఎంతమేర రెస్పాన్స్ వస్తుందన్నది ఆసక్తికంగా మారింది. ఓటీటీలోనూ నెగటివ్ రివ్యూలే వస్తాయా లేక కొంతయినా ఆదరణ లభిస్తుందా అన్నది చూడాలి.
సంబంధిత కథనం