మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది మరో హిట్ వచ్చినట్లే కనిపిస్తోంది. తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 25) థియేటర్లలో రిలీజైన తుడరుమ్ (Thudarum) సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. తెలుగులోనూ ఇదే టైటిల్ తో రిలీజైన ఈ సినిమాలో మోహన్‌లాల్ నటన సూపర్ అంటూ అభిమానులు, రివ్యూయర్లు చెబుతున్నారు.
మోహన్ లాల్ ఈ ఏడాది ఇప్పటికే ఎల్2: ఎంపురాన్ తో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాను అందించాడు. ఈ మూవీ ఈ మధ్యే జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. ఇక ఇప్పుడు తుడరుమ్ కు కూడా అలాంటి రివ్యూలే వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామాతోపాటు రివేంజ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులోనూ ఇదే అర్థం కాని టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారన్న విమర్శలు వచ్చినా.. మూవీ చూసిన తర్వాత మాత్రం ప్రేక్షకులు మంచి రివ్యూలు ఇచ్చారు.
తరుణ్ మూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బెంజ్ అలియాస్ షణ్ముగం అనే పాత్రలో మోహన్‌లాల్ నటించాడు. అతని భార్య లలితగా శోభన నటించింది. సినిమాల్లో స్టంట్ మ్యాన్ గా పనిచేసి తర్వాత కేరళలోని ఓ ఊళ్లో సెటిలయ్యే బెంజ్ కు ఇద్దరు టీనేజీ పిల్లలు ఉంటారు. తనకు భారతీరాజా గిఫ్ట్ గా ఇచ్చిన అంబాసిడర్ గా కారు అంటే బెంజ్ కు ఎంతో ఇష్టం ఉంటుంది. దానిని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు.
అయితే ఒకరోజు బెంజ్ కొడుకు, అతని ఫ్రెండ్స్ ఆ కారును తీసుకెళ్తారు. అది అనుకోకుండా ఓ ప్రమాదంలో పడుతుంది. దానిని వర్క్‌షాప్ కు తీసుకెళ్లగా అందులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులు సీజ్ చేస్తారు. తనకెంతో ఇష్టమైన ఆ కారును పోలీసుల నుంచి విడిపించుకోవడానికి బెంజ్ ఎంతో ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ తుడరుమ్ మూవీలో చూడొచ్చు.
తుడరుమ్ మూవీలో మోహన్‌లాల్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మరోసారి ఆ వింటేజ్ మోహన్ లాల్ ను చూసే అవకాశం దక్కిందని, తరుణ్ మూర్తి అతనితో అద్భుతంగా నటింపజేశాడన్న కామెంట్స్ వస్తున్నాయి.
ఇక ఈ తుడరుమ్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఫిక్సయింది. ఇప్పటికే ఎల్2: ఎంపురాన్ సినిమా హక్కులను దక్కించుకొని స్ట్రీమింగ్ చేస్తున్న జియోహాట్‌స్టార్ ఓటీటీయే ఈ తుడరుమ్ మూవీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా మే చివరి వారం లేదా జూన్ లో ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
సంబంధిత కథనం