ఈ వీకెండ్ మంచి మర్డర్ మిస్టరీ చూడాలనుకుంటున్నారా? అయితే శుక్రవారం (జూన్ 6) జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ మిస్ కావద్దు. మరీ అంత థ్రిల్ పంచకపోయినా.. హత్య ఎవరు చేశారన్న సస్పెన్స్ మాత్రం మొదటి నుంచీ చివరి వరకూ కొనసాగుతుంది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ఛల్ కపట్ (Chhal Kapat).
ఛల్ కపట్ ఓ హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనర్థం మోసం అని. ఇది మధ్యప్రదేశ్ లోని బురాన్‌పూర్ అనే ఊళ్లో జరిగే కథ. అలీషా, షాలు, ఇరా, మెహక్ అనే నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. సిరీస్ మొదట్లోనే షాలు చనిపోయినట్లుగా చూపిస్తారు. అలీషా పెళ్లి వేడుకల కోసం వచ్చిన ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో నీటిలో మునిగి చనిపోతుంది. అప్పుడే ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్పీ దేవికా రాథోడ్ (శ్రియా పిల్గావ్‌కర్) ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగుతుంది.
షాలూ చనిపోయిన సమయంలో 9 మంది ఆ ఇంట్లో ఉండటంతో అందరినీ అనుమానితుల జాబితాలో ఆమె చేరుస్తుంది. దీనినో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని దేవికా గమనిస్తుంది. ఈ కేసును తీవ్రంగా పరిగణించి తన దర్యాప్తును మొదలుపెడుతుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన షాలూ హత్యలో ఆమె స్నేహితులతోపాటు ఇంట్లో వాళ్లు, ఆమె మేనేజర్, మెహక్ భర్త, మంత్రి కొడుకు అయిన విక్రమ్ చండేల్ కూడా ఉంటారు. మరి వీళ్లందరిలో నుంచి అసలు హంతకుడు ఎవరు అన్నది దేవిక ఎలా కనిపెడుతుందన్నదే ఈ ఛల్ కపట్ వెబ్ సిరీస్ స్టోరీ.
ఛల్ కపట్ ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అయితే తక్కువ బడ్జెట్ తో రూపొందడం వల్ల ఇందులో మంచి ప్రొడక్షన్ విలువలను మనం ఊహించలేం. అజయ్ భూయాన్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో లోపాలు కూడా చాలానే కనిపిస్తాయి. అసలు ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ను దర్యాప్తు చేసే తీరే గందరగోళంగా అనిపిస్తుంది. కానీ చాలా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఉండే సస్పెన్స్ మాత్రం మొదటి నుంచీ చివరి వరకూ కొనసాగుతుంది. హత్య ఎవరు చేశారు అన్న ప్రశ్న వేధిస్తూనే ఉంటుంది.
తనను వెంటాడుతున్న గతాన్ని దిగమింగుకుంటూనే దేవిక ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉంటుంది. ఏడు ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ రన్ టైమ్ కూడా తక్కువే. ఒక్కో ఎపిసోడ్ గరిష్ఠంగా 25 నిమిషాలు ఉంటుంది. కొన్ని 16 నిమిషాల్లోనే ముగిసేవి కూడా ఉన్నాయి. దీంతో రెండు, రెండున్నర గంటల్లోనే ఈ వెబ్ సిరీస్ ముగుస్తుంది. ఈ వీకెండ్ ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ ఛల్ కపట్ ను మీ లిస్టులో చేర్చుకోవచ్చు. జీ5 ఓటీటీలో హిందీ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం