OTT Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆర్య మేకర్స్ నుంచి మరో సిరీస్.. ఈసారి జలియన్ వాలా బాగ్ హత్యాకాండపై..
OTT Web Series: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆర్య మేకర్స్ నుంచి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈసారి 106 ఏళ్ల కిందట జరిగిన జలియన్ వాలా ఘటన వెనుక దాగి ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీయడానికి రానుండటం విశేషం.

OTT Web Series: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన సోనీ లివ్.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆర్య మేకర్స్ తో కలిసి ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ (The Waking Of a Nation) అనే వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. తాజాగా ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు. 106 ఏళ్ల కిందట జలియన్ వాలా బాగ్ లో అప్పటి బ్రిటీష్ బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ జరిపిన దారుణమైన హత్యాకాండ వెనుక కుట్ర కోణాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఈ సిరీస్ ద్వారా చేయబోతున్నారు.
ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ ఓటీటీ రిలీజ్ డేట్
ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ ఇప్పటి వరకూ పెద్దగా తెలియని చరిత్రను వెలికి తీయబోతోంది. ఈ వెబ్ సిరీస్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి తాజాగా సోమవారం (ఫిబ్రవరి 10) మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.
జలియన్ వాలా బాగ్ మారణకాండ వెనుక కుట్ర కోణాన్ని కనిపెట్టిన లాయర్ కాంతిలాల్ సాహ్ని (తారుక్ రైనా) దీనిపై న్యాయపోరాటానికి దిగడమే ఈ ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ స్టోరీ. ఈ జలియానా వాలా బాగ్ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ రిపోర్ట్ అంతా తప్పని ఈ లాయర్ కోర్టులో వాదిస్తాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లను ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.
నీరజ, ఆర్య మేకర్స్ నుంచి..
గతంలో నీరజ అనే మూవీ, ఆర్య అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన రామ్ మాధవానీయే ఈ ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. బ్రిటీష్ జమానాలో జరిగిన జాతి వివక్ష, పక్షపాతంలాంటి వాటిని తెరపైకి తీసుకురావాలని తాను చాలా కాలంగా అనుకుంటున్నట్లు రామ్ మాధవానీ ఈ సందర్భంగా చెప్పాడు.
అందులో భాగంగానే ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ అనే కోర్టు రూమ్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇది ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ. ఈ వెబ్ సిరీస్ ను రామ్ మాధవానీ ఫిల్మ్స్ బ్యానర్లో రామ్ మాధవానీ, అమితా మాధవానీ నిర్మించారు. ఈ సరికొత్త వెబ్ సిరీస్ ను మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.
ఏంటీ జలియన్ వాలా బాగ్ ఘటన?
జలియన్ వాలా బాగ్ మారణకాండ భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో ఊహకందని విషాదం. ఏప్రిల్ 13, 1919లో పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ లో ఇది జరిగింది. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ సుమారు 20 వేల మంది నిరసన తెలపడానికి గుమిగూడారు. అప్పటికే ఇలాంటి ఆందోళన కార్యక్రమాలపై నిషేధం విధించిన జనరల్ డయ్యర్.. అక్కడ నిరసన తెలుపుతున్న వారిపై అమానుషంగా కాల్పులు జరపడానికి ఆదేశించాడు.
మొత్తంగా 1650 రౌండ్ల బుల్లెట్లను ఫైర్ చేశారు. ఈ ఘటనలో ఎంతో మంది మరణించారు. మరెంతో మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీయడానికంటూ తాజాగా వస్తున్న ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం