The Village Trailer: ది విలేజ్ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. భయపెడుతున్న ఆర్య
The Village Trailer: ది విలేజ్ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. తమిళ నటుడు ఆర్య నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
The Village Trailer: హారర్ జానర్‌లో వస్తున్న వెబ్ సిరీస్ ది విలేజ్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానున్న ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (నవంబర్ 17) రిలీజైంది. తమిళ నటుడు ఆర్య ఈ సిరీస్ లో లీడ్ రోల్లో నటించాడు. ఈ సిరీస్ ట్రైలరే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. తమిళనాడులోని కట్టియాళ్ అనే ఊరి చుట్టూ తిరిగే కథ ఇది.
ట్రెండింగ్ వార్తలు
ది విలేజ్ ట్రైలర్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ వెబ్ సిరీస్ లో ఆర్యతోపాటు దివ్య పిళ్లై, ఆలియా, ఆదుకాలం నరేన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రైమ్ వీడియోలో వచ్చే శుక్రవారం (నవంబర్ 14) నుంచి ది విలేజ్ స్ట్రీమింగ్ కానుంది. అయితే తాజాగా రిలీజైన ట్రైలరే భయపెడుతోంది.
ది విలేజ్ ట్రైలర్
ఈ ట్రైలర్ ఓ రోడ్ ట్రిప్ కోసం బయలుదేరిన ఫ్యామిలీతో మొదలవుతుంది. ఈ ట్రిప్ అంతా జాలీగా ఎంజాయ్ చేద్దామనుకున్న ఆ ఫ్యామిలీ అనుకోని ప్రమాదంలో ఇరుక్కుంటుంది. మధ్యలో కారు టైరు పంక్చర్ కావడం, పక్కనే ఉన్న ఊళ్లోకి సాయం కోసం వెళ్లడం.. అక్కడ జరిగిన భయానక ఘటనలతో ట్రైలర్ సాగిపోయింది. ఈ సిరీస్ లో గౌతమ్ అనే పాత్రలో ఆర్య కనిపించాడు.
ఆ ఊళ్లోని కొన్ని అతీంద్రీయ శక్తులు అతని భార్యా, పిల్లలను ఎత్తుకెళ్లడంతో వాళ్లను రక్షించుకోవడానికి ఊళ్లోని ముగ్గురు వ్యక్తులు, ఇతర భద్రతా బలగాలతో అతడు వేట సాగిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన భయానక అనుభవాల చుట్టూ ఈ ది విలేజ్ స్టోరీ తిరుగుతుంది. ఆ అతీంద్రీయ శక్తులు ఏంటి? ఆ ఊళ్లోకి వెళ్లిన వాళ్లు తిరిగి రాకపోవడానికి కారణమేంటి? ఈ మిస్టరీని హీరో ఎలా ఛేదిస్తాడన్నది సిరీస్ లో చూడొచ్చు.
ఈ ట్రైలర్ లో కొన్ని సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ది విలేజ్ పేరుతోనే అశ్విన్ శ్రీవత్సంగమ్, వివేక్ రంగాచారి, షామిక్ దాస్‌గుప్తా రాసిన నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. తమిళనాడులోని కట్టియాళ్ ఊళ్లో జరిగినట్లుగా చిత్రీకరించారు. మిలింద్ రౌ ఈ సిరీస్ డైరెక్ట్ చేశాడు. బీఎస్ రాధాకృష్ణన్ స్టూడియో శక్తి బ్యానర్ లో నిర్మించాడు. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్ చూడొచ్చు.