OTT Thriller: ఓటీటీలోకి న్యూ థ్రిల్లర్ మూవీ- 59 మంది దుర్మరణంపై కథ- పార్లమెంట్‌లో ప్రధాని చూసిన సినిమా- ఎక్కడ చూడాలంటే?
The Sabarmati Report OTT Streaming Platform: ఓటీటీలోకి రాశీ ఖన్నా, 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే నటించిన థ్రిల్లర్ డ్రామా మూవీ ది సబర్మతి రిపోర్ట్ స్ట్రీమింగ్ కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన ది సబర్మతి రిపోర్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, రిలీజ్ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
The Sabarmati Report OTT Release: నిజ జీవిత సంఘటనల ఆధారంగా వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది అల్లర్లు, వివాదం అయ్యే సెన్సిటివ్ ఘటనలపై మూవీస్, వెబ్ సిరీసులు తెరకెక్కించడం పెద్ద సవాలుగా మారుతుంది. అలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించిన ఓ మూవీ ఓటీటీలోకి వచ్చేయనుంది.
సబర్మతి ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదం- 59 మంది మృతి
ఆ సినిమానే ది సబర్మతి రిపోర్ట్. 12th ఫెయిల్ మూవీ హీరో విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటించిన ది సబర్మతి రిపోర్ట్ సినిమాను 2002 ఫిబ్రవరి 27న గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఆధారంగా తెరకెక్కించారు. ఈ ప్రమాదంలో 59 ప్రాణాలు కోల్పోయారు.
అప్పుడు ఆ ఘటనకు సంబంధించిన కారణాలు, రాజకీయ పరిస్థితుల, బాధితుల గాథల మేళవింపుతో ది సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని డైరెక్టర్ ధీరజ్ సర్నా తెరకెక్కించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించిన ది సబర్మతి రిపోర్ట్ మూవీ నవంబర్ 15న థియేట్రికల్ రిలీజ్ అయింది.
ప్రధాని ప్రశంసలు
ఈ సినిమాను పార్లమెంట్ లైబ్రరీలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ కలిసి వీక్షించారు. వారితోపాటు సీనియర్ నటుడు జితేంద్ర, నటి రాశీ ఖన్నా పాల్గొన్నారు. అంతేకాకుండా ది సబర్మతి రిపోర్ట్ మూవీపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే, ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ చూసిన తొలి మూవీ ఇదే కావడం విశేషం.
"సబర్మతి రిపోర్ట్ సినిమాను తోటి ఎన్డీయే ఎంపీలతో కలిసి వీక్షించాం. చిత్ర నిర్మాతల కృషిని అభినందిస్తున్నాను" అని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 2న ట్వీట్ చేశారు. "జీవితాంతం గుర్తుండిపోయే రోజు ఇది. మా సినిమా చూడటానికి సమయం కేటాయించిన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను" అని హీరో విక్రాంత్ మాస్సీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రాసుకొచ్చాడు.
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయనుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో ది సబర్మతి రిపోర్ట్ ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ది సబర్మతి రిపోర్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్. అయితే, ఈ సినిమా జీ5 ఓటీటీలో హిందీ భాషలో అందుబాటులో ఉండనుంది.
గోద్రా సబర్మతి ఎక్స్‌ప్రెస్ సంఘటన చుట్టూ ఉన్న వాస్తవాలను సమర్ కుమార్ అనే జర్నలిస్ట్ వెలికి తీయడంతో కథ నడుస్తుంది. ఈ పాత్రలో విక్రాంత్ మాస్సే ఆకట్టుకుంటే మనికా రాజ్ పురోహిత్ పాత్రలో రిధి డోగ్రా, అమృతా గిల్ పాత్రలో రాశీ ఖన్నా నటించారు. నటులు బర్ఖా సింగ్, సుదీప్ వేద్, దిగ్విజయ్ పురోహిత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
అనేకసార్లు వాయిదా
అయితే, ఈ బాలీవుడ్ చిత్రం థియేటర్లలోకి రావడానికి ముందు అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొదటగా ఈ సినిమాను మే 3, 2024న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, తర్వాత ఆగస్ట్‌కు వాయిదా పడింది. అనంతరం ఫైనల్‌గా నవంబర్‌లో రిలీజ్ అయింది.