The Railway Men Review: ది రైల్వే మెన్ రివ్యూ - మాధవన్ హిందీ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?-the railway men web series review madhavan kk menon hindi web series streaming on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Railway Men Review: ది రైల్వే మెన్ రివ్యూ - మాధవన్ హిందీ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

The Railway Men Review: ది రైల్వే మెన్ రివ్యూ - మాధవన్ హిందీ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

The Railway Men Review: భోపాల్ గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న ఆధారంగా రూపొంది ది రైల్వే మెన్ వెబ్‌సిరీస్ ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. కేకే మీన‌న్‌, మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్ ఎలా ఉందంటే?

ది రైల్వే మెన్ వెబ్‌సిరీస్

The Railway Men Review: కేకేమీన‌న్‌, మాధ‌వ‌న్ (Madhavan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ది రైల్వే మెన్ వెబ్‌సిరీస్ ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) రిలీజైంది. 1984లో సంభ‌వించిన భోపాల్ గ్యాస్ లీకేజీ విప‌త్తు ఆధారంగా ద‌ర్శ‌కుడు శివ్ రావైల్ ది రైల్వే మెన్ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించాడు. నాలుగు ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ఆ మ‌హా విషాదాన్ని సిరీస్‌లో ఎలా చూపించారో తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘ‌ట‌న‌…

ఇఫ్తికార్ సిద్ధిఖీ (కేకే మీన‌న్‌) భోపాల్ రైల్వే స్టేష‌న్‌లో స్టేష‌న్ మాస్ట‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. వృత్తిలో నిజాయితీగా ఉంటాడు. త‌న వ‌ల్ల ఒక్క ప్రాణం కూడా బ‌లికావ‌ద్ద‌న్న‌ది అత‌డి సిద్ధాంతం. తోటివారికి సాయ‌ప‌డే గుణ‌మున్న అత‌డిని అంద‌రూ గౌర‌విస్తుంటారు. భోపాల్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలోనే యూనియ‌న్ కార్బైడ్ కంపెనీని విదేశీ సంస్థ నిర్వ‌హిస్తుంటుంది.

ఆ కంపెనీ భ‌ద్ర‌తా ప్ర‌మాణాల ప్ర‌కారం న‌డ‌వ‌డం లేద‌ని అధికారులు రిపోర్ట్ ఇస్తారు. కానీ రిపోర్టుల‌ను ప‌ట్టించుకోకుండా లాభాల కోసం ఉద్యోగుల‌కు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వ‌కుండా ప‌నులు చేయిస్తుంటుంది. యూనియ‌న్ కార్బైడ్ చేస్తోన్న మోసాల‌ను బ‌య‌ట‌పెట్టేందుకు జ‌గ్‌మోహ‌న్ (స‌న్నీ హిందుజా) అనే జ‌ర్న‌లిస్ట్ ప్ర‌య‌త్నిస్తుంటాడు. సోద‌రుడిగా భావించే తోటి ఉద్యోగి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక ఇమ‌ద్ రియాజ్ (బాబిల్ ఖాన్‌) యూనియ‌న్ కార్బైడ్‌లో ప‌ని మానేసి రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా చేరుతాడు.

యూనియ‌న్ కార్బైడ్ కంపెనీ ఉద్యోగుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా గ్యాస్ లీక్ అవుతుంది. ఆ విష‌వాయువులు పీల్చి భోపాల్‌లోని ప్ర‌జలు చాలా మంది ఉన్న చోట‌నే కుప్ప‌కూలి చ‌నిపోతుంటారు. ఆ ప్ర‌మాదం నుంచి రైల్వే స్టేష‌న్‌లో ఉన్న ప్ర‌యాణికుల‌తో పాటు వంద‌లాది మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడేందుకు ఇఫ్లికార్ సిద్ధికీ, ఇమ‌ద్ రియాజ్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశారు.

ఈ ప్ర‌య‌త్నంలో ఇఫ్తికార్‌కు పోలీస్ వేషంలో ఉన్న దొంగ బ‌ల్వంత్ యాద‌వ్ (దివ్యేందు) ఎలా స‌హ‌కారం అందించారు? భోపాల్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచేందుకు ప్ర‌భుత్వాన్ని ఎదురించి రైల్వే జీఏం ర‌తి పాండేతో (మాధ‌వ‌న్‌) పాటు రాజేశ్వ‌రి (జూహీచావ్లా) ఎలాంటి సాహ‌సానికి సిద్ధ‌ప‌డ్డారు? అన్న‌దే ది రైల్వే మెన్ వెబ్‌సిరీస్(The Railway Men Review) క‌థ‌.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా...

1984లో సంభ‌వించిన భోపాల్ గ్యాస్ లీకేజీ సంఘ‌ట‌న ఆధారంగా ద‌ర్శ‌కుడు శివ్ రావైల్ ది రైల్వే మెన్ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించాడు. ఈ మ‌హావిషాదంలో దాదాపు ప‌దిహేను వేల మందికిపైగా సామాన్యులు క‌న్నుమూశారు. ఈ విప‌త్తు నుంచి అమాయ‌కులైన ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌టానికి రైల్వే ఉద్యోగులు ప్రాణాల‌కు తెగించిన సాగించిన పోరాటాన్ని స్ఫూర్తిదాయ‌కంగా ఈ వెబ్‌ సిరీస్‌లో చూపించారు. ఇందిరా గాంధీ హ‌త్య స‌మ‌యంలో సిక్కుల‌పై కొన‌సాగిన దౌర్జ‌న్య‌కాండ‌ను అంత‌ర్లీనంగా ది రైల్వే మెన్‌లో సిరీస్‌లో(The Railway Men Review) ట‌చ్ చేశారు డైరెక్ట‌ర్‌.

భిన్న జీవితాల నేప‌థ్యంలో...

భోపాల్ మ‌హావిప‌త్తు తాలూకు విషాదాన్ని భిన్న నేప‌థ్యాలు క‌లిగిన వ్య‌క్తుల జీవితాల‌తో ది రైల్వే మెన్ భావోద్వేగ‌భ‌రితంగా ద‌ర్శ‌కుడు ఈ సిరీస్‌లో చూపించారు. భోపాల్ దుర్ఘ‌ట‌న‌కు కారుకులైన వారు ఎలాంటి శిక్ష లేకుండా బ‌య‌ట‌ప‌డే సీన్‌తోనే సిరీస్ ఆస‌క్తిక‌రంగా మొద‌ల‌వుతుంది.

ఆరంభంలో వ‌చ్చే డైలాగ్స్ ఆలోచ‌న‌ను రేకెత్తిస్తాయి. గ్యాస్ లీకేజీకి ప‌ద‌హారు గంట‌ల ముందు నుంచి ఈ క‌థ మొద‌ల‌వుతుంది. ఇఫ్తికార్ , ఇమ‌ద్‌తో పాటు జ‌గ్‌మోహ‌న్‌తో పాటు మిగిలిన పాత్ర‌ల ప‌రిచ‌యం చేస్తూ సిరీస్‌ను ఆస‌క్తిగా న‌డిపించారు(The Railway Men Review) డైరెక్ట‌ర్‌. ఓ ప‌క్క వారి జీవితాలు, మ‌రోప‌క్క యూనియ‌న్ కార్బైడ్ కంపెనీ సీన్స్‌తో ఉత్కంఠ‌ను పంచుతుంది.

క‌థ‌లో వేగం...

గ్యాస్ లీకేజీ త‌ర్వాతే క‌థ‌లో వేగం పెరుగుతుంది. స్టేష‌న్‌లోఉన్న ప్ర‌యాణికుల‌ను కాపాడేందుకు బ‌ల్వంత్ యాద‌వ్‌తో క‌లిసి ఇఫ్తికార్ సిద్ధిఖీ ప‌డే త‌ప‌న లో డ్రామా, ఎమోష‌న్స్ క‌దిలిస్తాయి. ఓ వైపు క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ మొత్తం దెబ్బ‌తిన‌డం, ప్ర‌భుత్వాలు స‌హాయం చేయ‌డానికి ముందుకు రాని ప‌రిస్థితుల్లో ఇఫ్తికార్‌, బ‌ల్వంత్ ఎలా సామాన్యుల ప్రాణాల‌ను కాపాడాడ‌న్న‌ది ఉద్విగ్న‌భ‌రితంగా ద‌ర్శ‌కుడు చూపించారు.

ర‌తీ పాండే క‌థ‌...

భోపాల్‌కు గోర‌ఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వ‌స్తుండ‌టంతో, అందులో ఉన్న వేలాది మంది ప్ర‌యాణికుల ప్రాణాల‌ను ర‌క్షించేందుకు ర‌తిపాండే టీమ్ ప్ర‌య‌త్నించే సీన్స్ థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ఆ ట్రైన్‌లో సిక్కు ఫ్యామిలీ క‌థ‌ను కూడి చూపించి క్యూరియాసిటీని రెట్టింపు చేశారు. ఒకే లైన్‌లో గోర‌ఖ్‌పూర్‌, రిలీఫ్ ట్రైన్ రావ‌డం, అవి ఢీకొట్ట‌కుండా చేయ‌డానికి ఇమ‌ద్ చేసిన త్యాగం క‌దిలిస్తుంది.

సిరీస్ ఆద్యంతం న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది.పాత్ర‌ల ప‌రిచ‌యానికి ద‌ర్శ‌కుడు ఎక్కువ స‌మ‌యం తీసుకున్నాడు. చాలా డీటైలింగ్‌గా చూపించ‌డంతో క‌థ ఎంత‌కు ముందుకు క‌ద‌ల‌ని భావ‌న క‌లుగుతుంది. సిక్కుల కాన్‌ఫ్లిక్ట్ బ‌ల‌వంతంగా క‌థ‌లో ఇరికించిన‌ట్లుగా ఉంది. గ్యాస్ లీకేజీ కార‌ణంగా సామాన్యులు చ‌నిపోయినా మెయిన్ క్యారెక్ట‌ర్స్‌కు ఏం కాక‌పోవ‌డం అన్న‌ది లాజిక్‌ల‌కు అంద‌దు.

కేకే మీన‌న్ జీవించాడు...

ఇఫ్లికార్ సిద్ధిఖీ పాత్ర‌లో కేకే మీన‌న్ జీవించాడు. స్టేష‌న్ మాస్ట‌ర్ పాత్ర‌కు అత‌డిని త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేనంత‌గా క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయాడు. కేకే మీన‌న్ త‌ర్వాత ఈ సిరీస్‌లో బాబిల్ త‌న న‌ట‌న‌తో మెప్పించాడు.

స‌హ‌జ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. స‌న్నీ హిందుజా, దివ్యేందు త‌మ పాత్ర‌ల‌కు వంద శాతం న్యాయం చేశారు. మాధ‌వ‌న్ రెండో ఎపిసోడ్ త‌ర్వాతే ఎంట‌ర్ అవుతాడు. సిరీస్‌లో అత‌డి క్యారెక్ట‌ర్‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. తాను క‌నిపించిన సీన్స్‌లో మెప్పించాడు. గెస్ట్ రోల్‌లో జూహీ చావ్లా న‌టించింది.

క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా...

రి రైల్వే మెన్ భోపాల్(The Railway Men Review) గ్యాస్ దుర్ఘ‌ట‌న‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూపించే సిరీస్ ఇది. క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి ఓపిక‌గా చూస్తే మంచి సిరీస్ చూసిన అనుభూతిని మిగుల్చుతుంది.