Recce Review: 'రెక్కీ'.. ఈ క్రైమ్ థ్లిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?-the new zee5 web series recce review in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Recce Review: 'రెక్కీ'.. ఈ క్రైమ్ థ్లిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?

Recce Review: 'రెక్కీ'.. ఈ క్రైమ్ థ్లిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?

Maragani Govardhan HT Telugu
Published Jun 30, 2022 03:53 PM IST

ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో రెక్కీ అనే వెబ్‌సీరీస్ ఇటీవలే విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ఏడు ఎపిసోడ్లు ఉంటుంది. పోలూరు కృష్ణ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా.. తమిళంలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నటుడు శ్రీరామ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు.

<p>రెక్కీ</p>
రెక్కీ (Twitter)

వెబ్‌సిరీస్: రెక్కీ

నటీనటులు: శ్రీరామ్, సమ్మెట గాంధీ, ఆడుగుళం నరేన్, శివ బాలాజీ, ఎస్తేర్ తదితరులు.

దర్శకుడు: పోలూరు కృష్ణ

ఓటీటీ: జీ5

కరోనా పుణ్యామాని ఓటీటీలో వెబ్‌సిరీస్‌లకు మనోళ్లు బాగా అలవాటు పడ్డారు. అంతకుముందు నుంచే వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు అలరిస్తున్నప్పటికీ.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ వేదికల్లో వచ్చే సిరీస్‌ల క్వాలిటీ, కంటెంట్ ముందు మనవి తేలిపోయాయి. అయితే కరోనా తర్వాతి కాలంలో ఈ విషయంలో మనోళ్లు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. గతేడాది ఆహాలో వచ్చిన కుడి ఎడమైతే లాంటి వెబ్‌సిరీస్‌లు వైవిధ్యాన్ని అందించాయి. తాజాగా జీ5లో విడుదలైన రెక్కీ కూడా ఈ కోవకే చెందుతుంది. శ్రీరామ్, శివ బాలాజీ, జీవా, ఆడుగుళం నరేన్, సమ్మెట గాంధీ తదితరులు నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ..

అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు(ఆడుగుళం నరేన్).. అతడి తనయుడు చలపతి(శివ బాలాజీ) కొన్ని నెలల వ్యవధిలోనే హత్యకు గురవుతారు. పదవీ కోసం రాజకీయ ప్రత్యర్థులే వీరిని చంపించారని అనుకుంటారు. కొత్తగా తాడిపత్రికి ఎస్ఐగా వచ్చిన లెనిన్(శ్రీరామ్) ఆ హత్యల వెనుకున్న మిస్టరీని ఛేదించే పనిలో పడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? ఏయే విషయాలు అతడు తెలుసుకుంటాడు? అసలు వారిని ఎవరిని చంపుతారు? అసలు విషయం తెలిసిన తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే..

తెలుగులో ఇంతకుముందు వచ్చిన వెబ్ సిరీస్‌ల కంటే ఇది ఉన్నత స్థాయిలో తెరకెక్కించారు. రాయలసీమ నేపథ్యం, అక్కడ పరిస్థితులు, భాష, యాస, మనుషుల వ్యక్తిత్వాలను ఇందులో బాగా చూపించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు ఉత్కంఠను రెక్కిత్తోస్తోంది ఈ రెక్కీ. ఏడు ఎపిసోడ్ల పాటు ప్రేక్షకులను అలాగే కూర్చునేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్కంఠ భరితంగా స్క్రీన్ ప్లేను నడిపించి మంచి థ్రిల్‌ను కలిగిస్తుంది.

రెక్కీ టైటిల్‌ను బట్టే ఈ సిరీస్ క్రైమ్ కథాంశంగా నడుస్తుందని అర్థమవుతుంది. అంతర్జాతీయ క్రైమ్ సిరీస్‌లతో పోల్చలేం కానీ.. ఇటీవల కాలంలో తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్‌లతో పోలిస్తే ఇది చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పవచ్చు. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్‌లో ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించే విధంగా సన్నివేశాలను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడనే చెప్పవచ్చు. నిత్యం హత్యల వెనుక అసలు ఎవరున్నారనే అంశాన్ని చివరి వరకు ఎంగేజింగ్‌గా ఉంచి.. ఆఖరులో ఒక్కొకటి రివీల్ చేసే విధానం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

తొలి మూడు ఎపిసోడ్లు ఈ సిరీస్ టైటిల్‌ను జస్టిఫై చేస్తాయి. వరదరాజులు హత్య కోసం రెక్కీ నిర్వహించడం, ఎలా చంపాలో ప్లాన్ చేయడం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా పరదేశీగా నటించిన సమ్మెట గాంధీ పాత్ర గుర్తుండిపోతుంది. తొలి మూడు ఎపిసోడ్ల తర్వాత కాస్త నిదానంగా సాగినప్పటికీ చివర్లో మళ్లీ ట్విస్టులను ఒకదానికొకటి రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది. కథ కాస్త డైవర్ట్ అయిందని అనిపించినప్పటికీ.. చివర్లో తిరిగి గాడిలో పడుతుంది.

ఎవరెలా చేశారంటే..

ఈ సిరీస్‌లో నటించిన నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. వరదరాజులు పాత్రలో నటించిన అడుగుళం నరేన్, అతడి తనయుడి చలపతి పాత్రను పోషించిన ఆడుగుళం నరేన్ తమ రోల్స్‌లో ఒదిగిపోయారు. ఈ సిరీస్‌ ప్రధాన పాత్రల్లో ఒకటైన ఎస్ఐ లెనిన్ పాత్రను శ్రీరామ్ చాలా సులువుగా చేసేశాడు. చాలా కాలం తర్వాత అతడికి మంచి గుర్తుండిపోయే రోల్ దక్కింది. పేరుకు అతడు హీరో అయనప్పటికీ.. అతడి కంటే కూడా సమ్మెట గాంధీ పోషించిన పరదేశీ పాత్ర హైలెట్‌గా ఉంటుంది. ఆ పాత్రలో అతడు అదరగొట్టాడు. రెక్కీ నిర్వహించేటప్పుడు అతడి యాక్టింగ్, హావాభావాలు.. ప్రేక్షుకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ సిరీస్‌లో అతడి నటన చూసిన తర్వాత.. గతంలో దర్శకులు సమ్మెట గాంధీని సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. వీరు కాకుండా ఎస్తేర్, రాజశ్రీ నాయర్, శరణ్య ప్రదీప్ ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు జీవా ఫర్వాలేదనిపిస్తారు. లెనిన్ భార్య పాత్రలో నటించిన ధన్య బాలకృష్ణన్‌ ఇందులో నామామాత్రమైన పాత్ర చేసింది.

సాంకేతికత పరంగా ఎలా ఉందంటే..

నిర్మాణం పరంగా రెక్కీ ఉన్నతంగానే ఉంటుంది. డీఓపీ కే మహేశ్ రాయలసీమ్ బ్యాక్‌డ్రాప్‌ను, అక్కడి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సంగీత పరంగా శ్రీరామ్ మద్దూరి ఆకట్టుకున్నారు. అతడి నేపథ్య సంగీతం ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఈ సిరీస్ రచయిత, దర్శకుడు అయిన పోలూరు కృష్ణ.. కష్టం ఇందులో కనిపిస్తుంది. వెబ్‌సిరీస్ రూపకల్పన కోసం బాగానే కసరత్తు చేశాడు. ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రతి ఎపిసోడ్‌ను స్పష్టంగా రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా బాగా ఉంది. ఒకటి, రెండు ఎపిసోడ్‌లో సాగదీత మినహా.. ఓవరాల్‌గా రెక్కీ చాలా థ్రిల్లింగ్‌ను కలిగిస్తుంది.

చివరగా రెక్కీ.. థ్లిల్లింగ్‌ను కలిగిస్తుంది.. ఓ లుక్కేయచ్చు

రేటింగ్: 3/5

Whats_app_banner

సంబంధిత కథనం