OTT: సంచలన హత్య కేసుపై ఓటీటీ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
The Indrani Mukerjea Story Buried Truth OTT Date: ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ పేరుతో డాక్యు సిరీస్ వస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా ఈ సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

షీనా బోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012లో షీనా బోరా మర్డర్ జరగగా.. సుమారు మూడేళ్ల తర్వాత 2015లో ఈ కేసులో అరెస్ట్ అయ్యారు ఇంద్రాణి ముఖర్జియా. తన కూతురు షీనాను ముఖర్జియానే హత్య చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇప్పుడు, షీనా బోరా హత్య కేసుపై ఓ డాక్యుమెంటరీ సిరీస్ వస్తోంది. ‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ పేరుతో ఈ డాక్యు సిరీస్ రూపొందుతోంది.
‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ డాక్యుమెంటరీ సిరీస్ ఫిబ్రవరి 23వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు అధికారికంగా వెల్లడించింది. ఇంద్రాణి ముఖర్జీయా ముఖం సగం కనపడేలా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
“ఒక కుటుంబానికి చెందిన చీకటి రహస్యాలు కేంద్రంగా ఓ సంచలన కేసు దేశం మొత్తాన్ని కుదిపేసింది. 'ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ నెట్‍ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 23న వస్తుంది” అని నెట్‍ఫ్లిక్స్ నేడు (జనవరి 29) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
2023లో ఇంద్రాణి ముఖర్జియా.. అన్‍బ్రోకెన్: అన్‍టోల్డ్ స్టోరీ పేరుతో ఓ బుక్ రాశారు. ఒకప్పుడు జర్నలిస్టు అయిన ఆమె.. హత్య కేసులో నిందితురాలిగా ఆరేళ్ల పాటు జైలులో ఉన్న జ్ఞాపకాలను, తన జీవితాన్ని గురించి ఈ బుక్‍లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంద్రాణి బెయిల్‍పై బయట ఉన్నారు.
షీనా బోరా హత్య, 2015లో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా ఈ కేసులో అరెస్ట్ అవడం వెనుక ఉన్న కోణాలపై ‘ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ ఉండనుంది. ఇంద్రాణి ముఖర్జియా, ఆమె పిల్లలు, వారి కుటుంబాల్లోని సంక్లిష్టతలు, గొడవలు ఇలా చాలా విషయాలు ఈ సిరీస్‍లో ఉంటాయని తెలుస్తోంది.
ఇంద్రాణి ముఖర్జియాకు షీనా బోరా, కుమారుడు మైకేల్ ఉన్నారు. అయితే, మొదటి భర్త సిద్ధార్థతో విడిపోయాక వారిద్దరినీ తల్లిదండ్రుల వద్దే ఆమె ఉంచారు. ఆ తర్వాత సంజీవ్ ఖన్నాను ఇంద్రాణి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన నుంచి కూడా విడిపోయి పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకున్నారు. అయితే, పెద్దయ్యాక తల్లి దగ్గరికి షీనా బోరా వెళ్లారు. అయితే, కుటుంబంలోని గొడవలు, ఆర్థిక వివాదాల కారణంగా కూతురు షీనా బోరాను తల్లి ఇంద్రాణి గొంతు నులిమి చంపారని అభియోగాలు నమోదయ్యాయి. ఇందుకోసం ఆమె రెండో భర్త సంజీవ్ సాయం తీసుకున్నారని విచారణలో వెల్లడైంది. వేరే కేేసులో ఇంద్రాణి డ్రైవర్ అరెస్ట్ కాగా.. ఆ సందర్భంగా ఈ హత్య విషయం బయటికి వచ్చింది. షీనా బోరా హత్య కేసు దేశాన్ని కుదిపేసింది.
పాపులర్ అయిన ‘కర్రీ అండ్ సెనైడ్’
నెట్‍ఫ్లిక్స్‌లో ఇటీవల ‘కర్రీ అండ్ సెనైడ్: జాలీ జోసెఫ్ మర్డర్ కేస్’ డాక్యుమెంటరీ ఫుల్ పాపులర్ అయింది. కేరళలోని కూడథై గ్రామంలో తన కుటుంబానికి చెందిన ఆరు మందిని 14ఏళ్లలో హత్య చేసిన జాలీ జోసెఫ్ అనే మహిళ కథ ఆధారంగా ఈ సిరీస్ వచ్చింది.