The Elephant Whisperers : అయ్యో పాపం.. వీళ్లను ఆస్కార్ గెలిచిన వాళ్లే మోసం చేశారు!
The Elephant Whisperers : ఆస్కార్ అవార్డు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్. నిజానికి ఈ డాక్యుమెంటరీ వస్తుందని ఎవరికీ తెలియదు. ఆస్కార్ గెలుచుకున్నాక.. ఒక్కసారిగా వైరల్ అయి.. ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు ఇందులో నటించిన వాళ్లు మేకర్స్ మీద విమర్శలు చేశారు.
95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers).. డాక్యుమెంటరీ అందరి దృష్టిని ఆకర్శించింది. ఆస్కార్ అవార్డు(Oscar Award) సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ చిత్రాన్ని దర్శకురాలు కార్తీకి గోన్సల్వేస్ తెరకెక్కించగా.. సిఖ్యా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఏనుగులను సంరక్షించే జంటగా.. బొమ్మన్, బెల్లీ దంపతులకు మంచి గుర్తింపు వచ్చింది.
భారతీయ సినిమాలో చరిత్ర సృష్టించిన డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంపై చాలా మంది ప్రశంసించారు. బొమ్మన్, బెల్లీ(Bomman Bellie) జంట ఏనుగును సంరక్షించిన విధానం అందరి హృదయాలను తాకింది. ఏనుగుకు, మనిషికి మధ్య ఉండే సంబంధాన్ని ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు. అయితే ఇప్పుడు అదే జంట ఫిర్యాదు చేసింది. గుడ్ విల్ గెస్చర్ కింద బొమ్మన్, బెల్లీ ఈ చిత్ర మేకర్స్ కు నోటీసులు పంపారు. తమకు పరిహారం కింద రూ.2 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ జంట నోటీసు పంపేందుకు కారణం కూడా ఉంది.
నిజానికి ఎలిఫెంట్ విస్పరర్స్.. డాక్యుమెంటరీ చిత్రీకరణ జరిగినంత కాలం కార్తీకి తో బొమ్మన్, బెల్లీకి స్నేహపూర్వక బంధం కొనసాగింది. ఆస్కార్ సాధించిన తర్వాత వీరిద్దరూ ఎంతో సంతోషానికి గురయ్యారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
ఇటీవల ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొమ్మన్, బెల్లీ కొన్ని వివరాలు వెల్లడించారు. డాక్యుమెంటరీ చిత్రీకరణ సమయంలో తనకు ఇల్లు కట్టిస్తానని, వాహనం, ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారని, అది చేయలేదని, ఇప్పుడు రూ.2 కోట్ల లీగల్ నోటీసు పంపామని బొమ్మన్ తెలిపారు.
'రియల్ హీరోలుగా అన్ని చోట్లా పరిచయం అయ్యాం. కానీ, టీమ్ నుంచి మాకు ఆర్థిక సాయం అందలేదు. ఆర్థికంగా వారే లబ్ధి పొందారు. నాకు, నా భార్యకు తమిళనాడు ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు. కానీ ఈ లక్షతో మా జీవితంలో ఏదీ మారదు. ఎన్నో అవసరాలు ఉంటాయి.' అని బొమ్మన్ ఆరోపించారు.
ఆస్కార్ గెలిచిన తర్వాత ఈ జంటను ప్రధాని మోదీ(PM Modi) కూడా కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. కొంతమంది నుంచి ఎన్నో హామీలు వచ్చాయి. కానీ ఏ ఒక్కటీ నెరవేరకపోవడం విడ్డూరం. ఏనుగును కాపాడి మానవీయ విలువలకు ప్రాణం పోసిన ఈ జంట ఆనాడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించి.. నేడు సాయం కోసం ఎదురుచూస్తోంది.
ఈ డాక్యుమెంటరీకి మంచి పేరు వచ్చింది. చిత్రీకరణ సమయంలో బొమ్మన్, బెల్లీ దంపతులకు ఎన్నో హామీలు ఇచ్చారు మేకర్స్. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాల్ చేసినా నిర్మాత రిసీవ్ చేయడం లేదని బొమ్మన్ చెబుతున్నారు. అందుకే నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అడవిలో అనాథ ఏనుగును పెంచుకున్న బెల్లీ నిజ జీవిత కథ ఆధారంగా డాక్యుమెంటరీని రూపొందించారు.
టాపిక్