The Crown Web Series: ఈ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.108 కోట్ల ఖర్చు.. అంతలా ఏముంది?
The Crown Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ది క్రౌన్ (The Crown) వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.108 కోట్ల ఖర్చు చేశారట. బ్రిటన్ రాజ వంశ చరిత్రను కళ్లకు కట్టేలే చేపిస్తున్న ఈ సిరీస్ ఆరో సీజన్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవనుంది.
The Crown Web Series: నెట్‌ఫ్లిక్స్ లో వచ్చే వెబ్ సిరీస్ సాధారణంగానే చాలా ఖర్చుతో హాలీవుడ్ సినిమాల రేంజ్ లో తీసినవి ఉంటాయి. అలాంటి వెబ్ సిరీస్ లలో ఒకటి ది క్రౌన్ (The Crown). గురువారం (నవంబర్ 16) నుంచి సీజన్ 6 పార్ట్ 1 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. అయితే ఈ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ కోసం చేసిన ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లలో ది క్రౌన్ కూడా ఒకటి. ఈ సిరీస్ ఒక్క ఎపిసోడ్ కోసం 1.3 కోట్ల డాలర్లు (సుమారు రూ.108 కోట్లు) ఖర్చు చేశారట. బ్రిటన్ రాచరికం ఆడంబరాన్ని కళ్లకు కట్టేలా ఈ సిరీస్ ను మేకర్స్ తెరకెక్కించారు. ఈ సిరీస్ కోసమే బకింగ్‌హామ్ ప్యాలెస్ ను రీక్రియేట్ చేయడం విశేషం. ఇదొక రాయల్ డాక్యుడ్రామా.
ది క్రౌన్.. ఖర్చు తడిసి మోపెడు..
ది క్రౌన్ తొలి సీజన్ 2016లో వచ్చింది. అప్పుడే ఈ సిరీస్ ను తెరకెక్కించడానికి ఏకంగా 14 కోట్ల డాలర్లు (సుమారు రూ.1160 కోట్లు) ఖర్చు చేయడం గమనార్హం. ప్రతి సీజన్ కు ఈ ఖర్చు పెరుగుతూనే వెళ్లింది. తొలి ఐదు సీజన్ల కోసమే ఈ సిరీస్ ను నిర్మించిన సోనీకి చెందిన లెఫ్ట్ బ్యాంక్ పిక్చర్స్ ఏకంగా 50.4 కోట్లు డాలర్లు (సుమారు రూ.4 వేల కోట్లు) ఖర్చు చేసినట్లు ఓ రిపోర్ట్ వెల్లడించింది.
ఎందుకింత ఖర్చు అన్న అనుమానం మీకు రావచ్చు. ఈ సిరీస్ లో మొత్తంగా 7 వేల ఖరీదైన కాస్ట్యూమ్స్ క్రియేట్ చేశారు. క్వీన్ ఎలిజబెత్ 2 వేసుకునే ఔట్‌ఫిట్ ను రీక్రియేట్ చేయడానికే 30 వేల డాలర్లు (సుమారు రూ.25 లక్షలు) ఖర్చు చేయడం విశేషం. ఇక ఈ సిరీస్ లో నటిస్తున్న నటీనటుల రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉన్నాయి.
ఈ సిరీస్ లో క్వీన్ ఎలిజబెత్ 2 యవ్వనంలో ఉన్నప్పటి పాత్ర పోషించిన క్లెయిర్ ఫాయ్ తొలి రెండు సీజన్లలో నటించింది. ఆమె ఒక్కో ఎపిసోడ్ కోసం 40 వేల డాలర్లు వసూలు చేసిందట. ఇక యంగ్ ప్రిన్స్ ఫిలిప్ పాత్రలో కనిపించిన మ్యాట్ స్మిత్ అయితే ఎపిసోడ్ కు 52 వేల డాలర్లు వసూలు చేసినట్లు సమాచారం.
అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్స్, సెట్స్, నటీనటుల రెమ్యునరేషన్లు, ఏమాత్రం రాజీపడకుండా చేసిన సిరీస్ నిర్మాణం.. ఈ ది క్రౌన్ వెబ్ సిరీస్ ను అత్యంత ఖరీదైన సిరీస్ లలో ఒకటిగా మార్చింది. ఆల్ టైమ్ 20 భారీ బడ్జెట్ సిరీస్ లలో ది క్రౌన్ కూడా ఒకటి. ఈ సిరీస్ ఆరో సీజన్ పార్ట్ 1 గురువారం (నవంబర్ 16) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.