Thangalaan OTT Streaming: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
Thangalaan OTT Streaming: తంగలాన్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. సుమారు నాలుగు నెలల నిరీక్షణకు తెరదించుతూ చియాన్ విక్రమ్ నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.
Thangalaan OTT Streaming: ఓటీటీలోకి తంగలాన్ మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు గుడ్ న్యూస్. అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చియాన్ విక్రమ్ మూవీ నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. కోర్టు కేసులు, ఓటీటీతో నిర్మాత సంస్థకు ఉన్న విభేదాల కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ మూవీ.. మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ అయింది.
తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్
తంగలాన్ మూవీ మొదటి నుంచీ చెబుతున్నట్లే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. డిసెంబర్ నెలలో రాబోతుందని గత నెలల వార్తలు వచ్చాయి. డిసెంబర్ 13 లేదా 20వ తేదీన రానుందని తెలిసింది.
అయితే ముందుగానే మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ప్రత్యక్షం కావడం ఆశ్చర్యం కలిగించింది. గత నెలలోనే కోర్టు కేసుకు సంబంధించి క్లియరెన్స్ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కు అడ్డంకి తొలగిపోయింది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ తోనూ మెల్లగా సయోధ్య కుదిరింది.
తంగలాన్ మూవీ గురించి..
ఈ ఏడాది ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ తంగలాన్. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా ఓటీటీ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.35 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు. పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా కనిపించారు.
తంగలాన్‌గా విక్రమ్ లుక్, యాక్టింగ్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తంగలాన్ మూవీకిగాను విక్రమ్‌తో పాటు పార్వతికి నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందని భావిస్తున్నారు. అయితే కాన్సెప్ట్‌లో ఆసక్తి లోపించడం, తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను స్క్రీన్‌పైకి తీసుకురావడంలో దర్శకుడి తడబాటు కారణంగా ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. తంగలాన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి పా రంజిత్ తంగలాన్ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.
తంగలాన్ స్టోరీ ఏంటంటే?
స్వేచ్ఛ స్వాతం త్య్రాల కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా దర్శకుడు పా రంజిత్ తంగలాన్ మూవీని తెరకెక్కించాడు. వేప్పూరుకు చెందిన గిరిజన నాయకుడు తంగలాన్ (విక్రమ్) తన భార్య గంగమ్మ (పార్వతి) ఐదుగురు పిల్లలతో కలిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటాడు.
పన్ను కట్టలేదని సాకుగా చూపించి తంగలాన్ భూమిని ఊరి జమీందారు స్వాధీనం చేసుకుంటాడు. జమీందారు ఆక్రమించుకున్న భూమిని తిరిగి సొంతం చేసుకోవడం కోసం బ్రిటీషర్లతో కలిసి అడవిలో ఓ బంగారు నిధిని వెలికితీయడానికి వెళతాడు తంగలాన్.
ఆ నిధికి ఆరతి (మాళవికా మోహనన్) రక్షణగా నిలుస్తుంది. అసలు ఆరతి ఎవరు? బంగారం కోసం అడవిలో అడుగుపెట్టిన తంగలాన్‌తో పాటు అతడి బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? బ్రిటీషర్ల వెంట వెళ్లిన తంగలాన్ వారిపై ఎందుకు తిరుగుబాటు చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
టాపిక్