Thandel OTT Rights: నాగ చైతన్య తండేల్ ఓటీటీ హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి.. చైతూ కెరీర్లోనే అత్యధికం
Thandel OTT Rights: నాగ చైతన్య నటిస్తున్న మూవీ తండేల్ ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. చైతన్య కెరీర్లోనే అత్యధికం ఇదే అని చెబుతున్నారు.
Thandel OTT Rights: నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న మూవీ తండేట్. ఈ సినిమా ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే దీనికోసం ఆ ఓటీటీ భారీ మొత్తం వెచ్చించినట్లు వచ్చిన వార్తలు నిజమే అని ఓ రిపోర్టు వెల్లడించింది.
నాగ చైతన్య కెరీర్లోనే అత్యధికం
కార్తికేయ 2 డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ తండేల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నాగ చైతన్య కూడా ఈ పాన్ ఇండియా మూవీపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.40 కోట్లకు కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
అది నిజమే అని ఈ మధ్యే ఓ రిపోర్టు వెల్లడించింది. ఈ సినిమా అన్ని దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ వస్తున్న విషయం తెలిసిందే. అన్ని భాషల ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ మొత్తానికి దక్కించుకుంది. నాగ చైతన్య కెరీర్లో గతంలో ఏ సినిమా డిజిటల్ హక్కులు ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోలేదు. ఈ విషయంలో తండేల్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
తండేల్ మూవీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి నటిస్తోంది. అంతేకాదు ప్రియదర్శి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. బన్నీ వాస్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అల్లు అరవిండ్ సమర్పిస్తున్నాడు. ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ లెక్కన ఓటీటీలో వచ్చే ఏడాది జనవరిలోనే స్ట్రీమింగ్ అవుతుంది.
తండేల్ కథేంటి?
గతంలో తండేల్ మూవీ స్టోరీలైన్‌ను నాగచైతన్య రివీల్ చేశాడు. యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు నాగచైతన్య చెప్పాడు. 2018లో శ్రీకాకుళానికి చెందిన ఓ జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు.
అతడిని పాకిస్థాన్ నేవీ అరెస్ట్ చేసింది. ఆ సంఘటన స్ఫూర్తితో తండేల్ మూవీ తెరకెక్కుతోన్నట్లు చైతన్య తెలిపాడు. ఏడాదిన్నర పాటు పాకిస్థాన్ జైలులో శిక్షను అనుభవించిన ఆ జాలరి ఎలా రిలీజయ్యాడు? ఆ జాలరిని క్షేమంగా ఇండియా రప్పించేందుకు అతడి ప్రియురాలు ఎలాంటి పోరాటం చేసిందనే అంశాలను తండేల్ సినిమాలో చూపించబోతున్నట్లు నాగచైతన్య తెలిపాడు.
కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండటంతో తండేల్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దేశభక్తి జానర్ కూడా తోడైన ఈ ప్రేమ కథను అతడు ఎలా తెరకెక్కిస్తాడో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
మూడు నెలల కిందటే మూవీ గ్లింప్స్ కూడా వచ్చింది. అందులో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్ లో కనిపించగా.. సాయి పల్లవి క్యూట్ లుక్స్ తో అలరించింది. ఇక ఇందులో పాకిస్థాన్ గడ్డపై నిల్చొని భారత్ మాతా కీ జై అంటున్నా చూడు అంటూ చైతన్య చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.