Thandel Movie: అలా అనిపించకపోతే పేరు మార్చుకుంటా: తండేల్ డైరెక్టర్ చందూ
Thandel Movie: తండేల్ సినిమా విషయంలో డైరెక్టర్ చందూ మొండేటి చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది. పేరు మార్చుకుంటానంటూ ఆయన ఓ మాట చెప్పారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించారు. శ్రీకాకుళం మత్య్సకారుడి నిజజీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. పాటలు, ట్రైలర్ తర్వాత తండేల్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందూ మొండేటి పాల్గొన్నారు. ఆయన చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది.

పేరు మార్చుకుంటా..
తండేల్ చిత్రాన్ని మళ్లీమళ్లీ చూడాలని ప్రేమికులకు అనిపించకపోతే తాను పేరు మార్చుకుంటానని డైరెక్టర్ చందూ మొండేటి చెప్పారు. తాను కమర్షియల్ హిట్ గురించి ఇలా అనడం లేదని అన్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్ చేశారు.
ప్రేమలో ఉన్న వారికి తండేల్ చిత్రాన్ని మళ్లీ చూడాలని అనిపిస్తుందని చందూ చెప్పారు. “హిట్ అవుతుందా.. కమర్షియల్ సక్సెస్ అవుతుందా అనే దాని గురించి చెప్పడం లేదు. చాలా మంది బుజ్జితల్లులు ఉన్నారు.. చాలా మంది రాజులు ఉన్నారు. ఈ సినిమాను వాళ్లు మళ్లీమళ్లీ వచ్చిచూస్తారు. అలా అనిపించకపోతే నా పేరు మార్చుకుంటా” అని చందూ మొండేటి చెప్పారు. తండేల్ మూవీలో మత్య్సకారుడు రాజుగా నాగచైతన్య, బుజ్జితల్లి పాత్రలో సాయిపల్లవి నటించారు.
చందూ మొండేటి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా కాన్ఫిడెంట్‍గా ఉన్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇలాంటి ఛాలెంజ్‍లు అవసరమా అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
చందూ మొండేటి తన గత చిత్రం కార్తీకేయ 2తో పాన్ ఇండియా రేంజ్‍లో సూపర్ హిట్ కొట్టారు. తండేల్ చిత్రం కోసం చాలా రీసెర్చ్ చేసినట్టు తెలిపారు. పాకిస్థాన్ దళాల చేతికి చిక్కి కొన్ని నెలల పాటు చిత్రహింసల తర్వాత భారత్‍కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల కథలో తండేల్‍ను తెరకెక్కించారు. ఈ మూవీలో లవ్ స్టోరీతో పాటు దేశభక్తి అంశం కూడా ప్రధానంగా ఉంటుంది. అయితే, ప్రేమకథనే ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చందూ క్లారిటీ ఇచ్చారు.
తండేల్ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి పాటలు మంచి బజ్ తీసుకొచ్చాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించగా.. సమర్పకుడిగా అల్లు అరవింద్ ఉన్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలో ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది.
నేడే ప్రీ-రిలీజ్ ఈవెంట్
తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 2) జరగనుంది. తండేల్ జాతర పేరుతో జరిగే ఈ ఈవెంట్‍కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ముందుగా ఫిబ్రవరి 1నే ఈవెంట్ ఉంటుందని మూవీ టీమ్ ప్రకటించగా.. ఓ రోజు వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ పాల్గొంటున్న తొలి మూవీ ఈవెంట్ ఇదే. దీంతో ఆయన ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఈవెంట్‍కు అభిమానులకు అనుమతి లేదు. మూవీ టీమ్, కొందరు సెలెబ్రిటీలు ఉండనున్నారు.
సంబంధిత కథనం