Thandel Movie Collections: తండేల్ సినిమాకు అదిరిన ఓపెనింగ్.. నాగచైతన్యకు రికార్డు
Thandel Day 1 Collections: తండేల్ చిత్రం మంచి ఓపెనింగ్ అందుకుంది. ఫస్ట్ డే అదిరే కలెక్షన్లు వచ్చాయి. నాగచైతన్య కెరీర్లో రికార్డుగా నిలిచింది. ఆ వివరాలు ఇవే..

యువ సామ్రాట్ నాగచైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించింది. మంచి హైప్ మధ్య ఈ చిత్రం ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) థియేటర్లలో రిలీజైంది. నిజజీవిత స్టోరీ ఆధారంగా ఈ మూవీని దర్శకుడు చందూ మెండేటి తెరకెక్కించారు. తండేల్ చిత్రానికి ఎక్కువ శాతం పాజిటివ్ టాకే వచ్చింది. హైప్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. దీంతో ఈ చిత్రానికి ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ దక్కాయి.
తండేల్ తొలి రోజు కలెక్షన్లు
తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.16కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కినట్టు ట్రేడ్ అనలిస్టులు లెక్కకట్టారు. ఇండియాలోనే ఈ మూవీకి ఫస్ట్ డే రూ.10 కోట్ల నెట్ (సుమారు రూ.13కోట్ల గ్రాస్) కలెక్షన్లు దక్కినట్టు తెలుస్తోంది. మిగిలినది ఓవర్సీస్ ద్వారా వచ్చింది. కలెక్షన్లలో తెలుగులోనే అధిక భాగం వచ్చాయి. హిందీ, తమిళంలో పెద్దగా వసూళ్లు దక్కలేదు. తొలి రోజు ప్రపంచవ్యాప్త గ్రాస్ లెక్కలను మూవీ టీమ్ కూడా నేడు పోస్టర్‌తో వెల్లడించే ఛాన్స్ ఉంది.
చైతన్యకు బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డు
తండేల్ చిత్రంతో తన కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డు దక్కించుకున్నారు నాగచైతన్య. చైతూ, పల్లవి కలిసి నటించిన లవ్ స్టోరీ చిత్రానికి ఫస్ట్ డే సుమారు రూ.9కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. నాగచైతన్య కెరీర్లో ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్‍గా ఉంది. ఇప్పుడు తండేల్ తొలి రోజు ఆ లెక్కను దాటేసింది. దీంతో నాగచైతన్య కెరీర్లో బిగెస్ట్ ఓపెనింగ్‍గా నిలిచింది.
సక్సెస్ సెలెబ్రేషన్లను కూడా తండేల్ మూవీ టీమ్ శుక్రవారమే జరుపుకుంది. ఈ వీకెండ్‍కు కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశం ఉంది. పెద్దగా పోటీ కూడా లేకపోవటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు దక్కించుకునేలా కనిపిస్తోంది.
తండేల్ చిత్రంలో శ్రీకాకుళం మత్స్యకారుడు రాజు పాత్రలో నాగచైతన్య యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సత్య అలియాజ్ బుజ్జితల్లి క్యారెక్టర్లో సాయిపల్లవి మరోసారి మెప్పించారు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. పాకిస్థాన్ జైలులో నెలల పాటు గడిపి భారత్‍కు తిరిగివచ్చిన శ్రీకాకుళం జాలర్ల నిజజీవిత ఘటనతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తొలి అరగంట సాగదీతగా అనిపించినా.. మిగిలిన చిత్రం ఆకట్టుకుందనే టాక్ వచ్చింది.
తండేల్ మూవీలో నాగచైతన్య, సాయిపల్లవితో పాటు ఆడుకాలం నరేన్, ప్రకాశ్, కరుణాకరన్, బబ్లూ పృథ్విరాజ్, చరణ్‍దీప్, కల్పలత కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. షందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ చేశారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నివాసు ప్రొడ్యూజ్ చేసిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించారు.
సంబంధిత కథనం