Devi Putrulu Review: కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి విజయ్, సూర్య హీరోలుగా నటించిన తెలుగు మూవీ దేవీపుత్రులు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దేవయాని, విజయలక్ష్మి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సిద్దిఖీ దర్శకత్వం వహించాడు. ఫ్రెండ్‌షిఫ్, లవ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది.
అరవింద్ (దళపతి విజయ్), చంద్రు (సూర్య), కృష్ణమూర్తి (రమేష్ ఖన్నా) ప్రాణమిత్రులు. చిన్ననాటి నుంచి కలిసే పెరుగుతారు. అరవింద్ చెల్లెలు అమృత (విజయలక్ష్మి) చంద్రును ప్రేమిస్తుంటుంది. ఈ ప్రేమ విషయం అరవింద్‌కు తెలిస్తే తమ స్నేహం చెడిపోతుందని చంద్రు భయపడతాడు. జమీందారి అమ్మాయితో తాను ప్రేమలో ఉన్నట్లు కృష్ణమూర్తి ద్వారా అమృతకు అబద్ధం చెప్పిస్తాడు చంద్రు.
ఆ అబద్ధం కారణంగా జమీందారి మనుషులు చంద్రుపై ఎటాక్‌చేస్తారు. వారి బారి నుంచి చంద్రును అరవింద్ కాపాడుతాడు.జమీందారి కారును కాల్చేస్తాడు. ఈ గొడవ కారణంగా చంద్రు, అరవింద్ కొన్నాళ్లు ఊరు విడిచి వైజాగ్ వెళ్లిపోవాల్సివస్తుంది. పెయింటర్ (వడివేలు) దగ్గర అసిస్టెంట్స్‌గా జాయిన్ అవుతారు.
అక్కడే పద్మినిని (దేవయాని) చూసిన అరవింద్ ఆమెను ఇష్టపడతాడు. ఓ ప్రమాదం నుంచి పద్మినిని కాపాడుతాడు. పద్మిని పేరుతో ఆమె చెల్లెలు ప్రేమ లేఖలు పంపిస్తుంది. అవి పద్మిని రాసిందని అరవింద్, చంద్రు భ్రమపడతారు. అరవింద్ ప్రేమ సంగతి తెలియని పద్మిని మరో అబ్బాయితో పెళ్లికి సిద్ధపడుతుంది.
ఆ పెళ్లిని గొడవ చేసి చంద్రు ఆపించేస్తాడు. దాంతో చంద్రుపై పగను పెంచుకుంటుంది పద్మిని. ఆ కోపంతోనే అరవింద్‌ను పెళ్లిచేసుకుంటుంది. చంద్రు, అరవింద్ మధ్య ఉన్న స్నేహాన్ని పద్మిని ఎలా చెడగొట్టింది? చంద్రు తమ్ముడి చావుకు అరవింద్ ఎలా కారణమయ్యాడు? చంద్రు కోమాలోకి వెళ్లిపోవడానికి కారణం ఎవరు? చంద్రు మంచితనాన్ని పద్మిని అర్థం చేసుకుందా? అమృత, చంద్రుల ప్రేమకు అరవింద్ ఓకే చెప్పాడా లేదాఅన్నదే ఈ మూవీ కథ.
కోలీవుడ్ అగ్ర హీరోలు దళపతి విజయ్, సూర్య కాంబోలో 2001లో వచ్చిన మూవీ ఇది. తమిళంలో ఫ్రెండ్స్ పేరుతో రూపొందిన ఈ మూవీ తెలుగులో దేవీపుత్రులు పేరుతో డబ్ అయ్యింది. ఫ్రెండ్‌షిప్, లవ్, రివేంజ్ అంశాలతో దర్శకుడు సిద్ధిఖీ ఈ మూవీని తెరకెక్కించారు.
విజయ్, సూర్య మధ్య స్నేహాన్ని చాటిచెప్పే సీన్స్‌తోనే దేవీ పుత్రులు మూవీ మొదలవుతుంది. ఆ తర్వాత అమృతతో చంద్రు లవ్‌స్టోరీలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌లో సూర్య, విజయ్ కలిసి కనిపించడం అభిమానులకు ఓ ట్రీట్‌గా అనిపిస్తుంది. అపార్థాలు అపోహలతో చంద్రు, అరవింద్ ఎలా విడిపోయారు? వారి మధ్యలోకి పద్మిని ఎలా వచ్చిందన్నది సెకండాఫ్‌లో చూపించాడు. అప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సన్నివేశాలు సాగుతాయి.
ప్రాణ స్నేహితులుగా విజయ్, సూర్య కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ బాగున్నాయి. జోవియల్ క్యారెక్టర్‌లో విజయ్ కనిపించగా...సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో సూర్య మెప్పించాడు. పాటల్లో తన స్టెప్పులతో విజయ్ అదరగొట్టాడు. హీరోయిన్లుగా ఈ మూవీలో దేవయాని, విజయలక్ష్మి కనిపించారు. వడివేలు, రమేష్ ఖన్నా పంచ్ డైలాగ్స్ కొన్నిచోట్ల నవ్విస్తాయి.
ఫ్రెండ్స్ మూవీని తెలుగులో అక్కినేని హీరోలు నాగార్జున, సుమంత్ స్నేహమంటే ఇదేరా పేరుతో రీమేక్ చేశారు. తమిళం, మలయాళంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.