Thalapathy Vijay: దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాలు చేస్తాడా? అతడు నవ్వుతూ ఇలా..
Thalapathy Vijay: దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాడా? లక్షలాది మంది అభిమానులను వేధిస్తున్న ఈ ప్రశ్నకు ది గోట్ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు సమాధానం ఇచ్చాడు. ఇదే ప్రశ్న తాను అడిగితే అతడు నవ్వుతూ ఇలా అన్నాడంటూ విజయ్ చెప్పిన విషయం గుర్తు చేసుకున్నాడు.
Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్). ఈ సినిమా తర్వాత విజయ్ ఇక తన కెరీర్లో చివరి సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అతడు రాజకీయాల్లోకి వెళ్తుండటమే దీనికి కారణం. అయితే విజయ్ సినిమాల్లో కొనసాగుతాడా లేదా అన్నదానికి ది గోట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు సమాధానం ఇచ్చాడు.
విజయ్ నవ్వుతూ ఇలా అన్నాడు
దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ట్రైలర్ ఈ మధ్యే రిలీజైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత డైరెక్టర్ వెంకట్ ప్రభు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విజయ్ సినిమాల్లో కొనసాగుతాడా అన్న ప్రశ్న అడగ్గా.. తాను కూడా దీనికి సమాధానం తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు అతడు చెప్పడం విశేషం.
"ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలాగే, లక్షలాది మంది విజయ్ అభిమానుల్లాగే తాను కూడా అతడు నటన కొనసాగించాలని ఆశిస్తున్నాను. నిజానికి రెండింటినీ బ్యాలెన్స్ చేయగలరా అని కూడా అతన్ని నేను అడిగాను. అతడు నవ్వుతూ చూద్దాం అని అన్నాడు. అతన్ని స్క్రీన్ పై చూడటం ఎప్పుడూ ఓ కలగా ఉండేది. కానీ అతనికీ ఓ కల ఉంది. దానికి మనం మద్దతివ్వాలి" అని వెంకట్ ప్రభు అన్నాడు.
రాజకీయాలతో సంబంధం లేదు
ఇక ఈ మధ్యే రిలీజైన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ట్రైలర్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఓ డైలాగ్ ఉండటాన్ని ప్రస్తావించగా.. తాము ఎప్పుడూ ఆ పని చేయమని, సినిమా చూస్తే అది ఎందుకు ఉందో అర్థమవుతుందని వెంకట్ ప్రభు అన్నాడు.
"అది రాజకీయ సంబంధిత అంశం కాదు. అది గిల్లీకి సంబంధించింది. అది గిల్లీటికల్. మీరందరూ సినిమా చూశారు. మరి గిల్లీ మేకర్స్ మురుగన్ ను ఎందుకు ఓ రాజకీయ వస్తువుగా ఉపయోగించారో ఎందుకు ప్రశ్నించరు? తన పొలిటికల్ ఎజెండాను ప్రతిబింబించేలా ఒక్క డైలాగ్ కూడా వద్దని విజయ్ సర్ స్పష్టం చేశాడు. గోట్ ఓ కమర్షియల్ మూవీ.
ట్రైలర్లో కొన్ని డైలాగులు అతని రాజకీయ కెరీర్ ను ఉద్దేశించినవిగా అనిపించవచ్చు. కానీ సినిమా చూస్తే నెరేటివ్ కు ఆ డైలాగ్స్ సరిపోతాయి. ఇందులో రాజకీయ సంబంధ అంశాలేమీ లేవు. విజయ్ సర్ ఓ సినిమాను సినిమాగానే చూస్తారు. మేమెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడుకోలేదు" అని వెంకట్ ప్రభు స్పష్టం చేశాడు.