Jana Nayagan Release Date: దళపతి విజయ్ చివరి మూవీ జన నాయగన్ ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. గతంలో ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా రానుందని చెప్పినా.. ఇప్పుడు రిలీజ్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జనవరి 9, 2026న రిలీజ్ కాబోతోందని మేకర్స్ సోమవారం (మార్చి 24) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచాడు. తన చివరి సినిమా జన నాయగన్ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలోనే మూవీ టైటిల్ రివీల్ చేశారు. విజయ్ చివరి మూవీ కావడంతో దీనికి ఎక్కడ లేని క్రేజ్ నెలకొంది.
ఈ సినిమా తర్వాత అతడు పూర్తిస్థాయిలో తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లోనూ అతడు పోటీ చేయనున్నాడు. ఈ జన నాయగన్ మూవీలో దళపతి విజయ్ తోపాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు, మోనిషా బ్లెస్సీలాంటి వాళ్లు నటిస్తున్నారు.
నిజానికి జన నాయగన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్లోనే రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ దానిని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించడనుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదు.
ఇక తెలుగులో వచ్చే ఏడాది జనవరి 9నే జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ ఎన్టీఆర్31 రిలీజ్ కాబోతోంది. దీనికితోడు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రవితేజ, వెంకటేశ్ లాంటి వాళ్లు కూడా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా అదే సమయానికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
సంబంధిత కథనం