Thalapathy Vijay: 14ఏళ్ల తర్వాత కేరళలో అడుగుపెట్టిన దళపతి విజయ్.. ఫ్యాన్స్ ఫుల్ హంగామా.. రోడ్లు బ్లాక్: వీడియోలు
Thalapathy Vijay in Kerala: దళపతి విజయ్ చాలా ఏళ్ల తర్వాత కేరళలో అడుగుపెట్టారు. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రం షూటింగ్ కోసం ఆయన అక్కడి వెళ్లారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అభిమానులు ఆయన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్‍కు తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానగణం ఉంది. ఇది మరోసారి రుజువైంది. సుమారు 14 ఏళ్ల తర్వాత దళపతి విజయ్ కేరళలో అడుగుపెట్టారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సినిమా కోసం ఆయన నేడు (మార్చి 18) తిరువనంతపురం చేరుకున్నారు.
భారీగా అభిమానులు
తిరువనంతపురం ఎయిర్ పోర్టు వద్ద దళపతి విజయ్‍కు స్వాగతం చెప్పేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. ఆయన కోసం వేచిచూశారు. విజయ్ రాగానే ఒక్కసారిగా అందరూ కేకలు, విజిళ్లతో మోత మెగించారు. దళపతి.. విజయ్.. విజయ్.. అంటూ హోరెత్తించారు.
రోడ్డు పొడవునా దళపతి విజయ్ కారును చాలా మంది అభిమానులు చుట్టుముట్టారు. కారులో నుంచి సన్‍రూఫ్ ద్వారా నిలబడి అభిమానులను విజయ్ అభివాదం చేశారు. చేయి ఊపుతూ పలుకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. కేరళలో విజయ్ క్రేజ్ చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో రావడంతో తిరువనంతపురం ఎయిర్ పోర్టు పరిసరాల్లో రోడ్లు బ్లాక్ అయిపోయాయి. భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల వాహనాలు చాలాసేపు నిలిచిపోయాయి.
2011లో కావలాన్ మూవీ షూటింగ్ కోసం చివరగా కేరళ వచ్చారు విజయ్. మళ్లీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్రంలో అడుగుపెట్టారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఫ్యాన్స్ భారీ స్థాయిలో వచ్చి, ఉత్సాహం చూపారు.
గోట్ మూవీ గురించి..
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సినిమాకు మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్‍లో దళపతి విజయ్ నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు చాలా ఆసక్తిని రేకెత్తించాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాన్ని జూన్‍లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీన్ని టార్గెట్‍గా పెట్టుకొని చిత్రీకరణను వేగంగా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదవి హీరోయిన్‍గా నటిస్తుండగా.. ప్రభుదేవ, ప్రశాంత్, స్నేహ, లైలా, జయరాం, అజ్మల్, వీటీవీ గణేశ్, వైభవ్ కీరోల్స్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ
దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గత నెలలోనే తమిళగ వెట్రి కజగమ్ (TVK) పార్టీని స్థాపించారు. అలాగే, గోట్ తర్వాత మరొక్క చిత్రమే చేసి సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని తెలిపారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై విజయ్ తన చివరి మూవీ చేయనున్నారని తెలుస్తోంది. ఇది విజయ్‍కు 69వ సినిమాగా ఉండనుంది. ఈ చిత్రం తర్వాత సినిమాలకు గుడ్‍బై చెప్పి.. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించాలని విజయ్ భావిస్తున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు.